Monday, 16 May 2016

హేమంత స్పర్శ - 17రేయ్ ఆత్మైషీ, 

ఏమి చేస్తున్నావురా…? ఏమయ్యిందోయ్… సాంధ్యవర్ణం కాటుకద్దుకుని రెండుగంటలు దాటినా నీ పలుకింకా విన రాలేదేం… సరేలే...  నువ్వు పలుకరించే లోగా మన  ఉదయంలోకి  వెళ్లి వస్తానేం...

‘చాలా వేడిగా ఉంది రా ఇక్కడ’ అని నువ్వన్నప్పుడల్లా నీ చుట్టూ  చలువ గదిలా పరచుకునే విద్య నాకు వచ్చి  ఉంటే ఎంత బాగుండో కదా అనిపించటం లో పెద్ద విశేషం ఏమీ లేదు నీ చుట్టూ చలచల్లగా విస్తరించి పోవాలనే  మెత్తని స్వార్ధం తప్ప. 

‘ఏం చేస్తున్నావ్ రా’ అని నువ్వు అడిగేడప్పుడు తెలియదూ నే ఖాళీగా ఉన్న ప్రతి క్షణమూ మన క్షణాలని పట్టుకుని తిరుగుతూ ఉంటానని ! నీకు తెలుసు… అయినా అలా అడగటం నీకిష్టం… నిన్నలా  వినడం నాకిష్టం.  

‘నువ్వలా ఉంటే నాకు బెంగగా ఉంటుందిరా’ అంటావ్… మరి బెంగ ఉండేది నీకొక్కదానికేనారా? నాకు ఉండదాా… నాకు ప్రాణమైన మనిషి తనని తాను నిర్లక్ష్యం చేసుకుంటుంటే మరి నాకెలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించు. ఇకపై ఎవరి మీద అలకతోనో నిన్ను నువ్వు బాధ పెట్టుకోవటం ఎప్పుడూ చెయ్యవు కదూ.  ఇలా అడిగితే ‘సరేరా' అంటావ్. మళ్ళీ నీ ధోరణి నీదే. 

అయినా ఏం పిల్లవో ఏమో… ఊర్లు పట్టుకుని తిరుగుతున్నప్పుడు ఆరోగ్యం ఎలా చూసుకోవాలో నీకు తెలియదూ…అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు చెప్తున్నా గుర్తుంచుకో.  అది నీ ఆరోగ్యం కాదోయ్. నాది… అవును అది అచ్చంగా నాది. మరి దాన్ని ఎలా చూసుకోవాలో  నాకన్నా  నీకే బాగా తెలుసు కదా…!

అదిగో అలగకలా… అల్లిబిల్లి అలకల్లో నీ బుంగమూతి ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే మళ్ళీ మళ్ళీ నిన్ను ఉడికించాలనిపిస్తుంది. అప్పుడేమో ‘నేనేడుస్తా’ అంటావ్. నాకసలు నచ్చని పదం రా అది. అదే నేను ఎప్పుడైనా ఒక  పెద్ద అలక పాన్పు చూసుకుని ఎక్కేద్దాం అనుకుంటానా… ఒక్క చిన్ని నవ్వుతో దాన్ని ఆచూకి మాయం చేసేస్తావ్. అలాంటప్పుడు నువ్వు మాయావివి కాక మరేమిటి?  ఉడుక్కోకలా. ప్రాణం పోసుకున్న బంగారానివిరా  నువ్వు ! 

ఎప్పటికప్పుడు  నిన్నొక వచనంగా రాసుకున్నాక, కాసేపలా నిన్ను చదువుకోవటం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఏదో ‘రాసుకున్నాక’ అంటున్నాను కానీ నిజానికి నువ్వెప్పుడూ ముగియని వాక్యానివి… అక్షరం వెనుక అక్షరం… పదం జతగా పదం సంగతులు చెప్పుకుంటూ ఒక వాక్యంగా నిన్ను కొనసాగించటం తప్ప ముగింపుని మదిలోకి చేరనియ్యను. 

కాసేపలా ప్రపంచాన్ని వెలివేసుకున్నప్పుడు, నిన్ను రాసిన ప్రతి వాక్యమూ వాస్తవమై నన్ను ముప్పిరిగొన్నప్పుడు ప్రతి పదం చివరా నువ్వే వేళాడుతూ నీరెండ మెరుపువై నన్ను నీకు కట్టేసుకుంటావ్ చూడూ… అంతకన్నా ఇంకేం కావాలి రా జీవితం లో?

మొన్న  రాత్రి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎంత వాన పడిందో… అప్పుడు  కుండపోతగా బయటే కురిసేస్తూ కూడా …ఒక్క చినుకూ నన్ను పలకరించలేదు… పైగా  నా వంట్లోని ఉన్న నీటినీ చెమటగా తను తాగేస్తూ ఎంత చిరాకు పెట్టేసిందో తెలుసా…! ఇదిగో ఇప్పుడేమో ఇలా నీకు ఉత్తరం రాస్తుంటే… కిటికీలోనుండి కొన్ని చిలిపి చినుకులు తడి గంటలు కొడుతూ దొంగచాటుగా నన్ను తడిపేస్తున్నాయ్… అది  నా మీద ఇష్టం కాదు సుమా …  నా అక్షరాల నిండా పరచుకుంటున్న నిన్ను తడమటానికి. చూడు మరి !  చినుకులకీ నువ్వంటే ఎంత మోహమో…

పాత చరణాలే  రాసుకుంటున్న  కొత్తపాటలో  ఆనందాన్ని ఆలపించటం అంటే శూన్యాన్ని మరింత దగ్గరగా హత్తుకుంటున్న భావన వస్తుంది తప్ప అరుదైన  ఆహ్లాదం పలకరించదు.  నువ్వూ  ఒప్పుకుంటావ్ కదూ.  మరి ఎప్పటికప్పుడు కొత్తగా నిన్ను శ్వాసించడం నాకూ… నాకు ఊపిరింతగా మారడం… ఒక ఆహ్లాదాన్ని  మన ఉచ్ఛ్వాసనిశ్వాసల సరాగంలో ఓలలాడించడం ఎంతటి మధురమో...

మనమై పోయిన ఆ రెండు ఆత్మైక్యాల లయ విన్యాసాలలో నువ్వూ… నేను… ఎవరమెక్కడో… ఎవరికెవరమో… నువ్వెవరో… నేనెవరో…అన్నీ మటుమాయం… అవన్నీ మిథ్య… ఇప్పుడున్నదంతా ‘మనం’.  నిన్ను నువ్వు, నన్ను నేను నిలుపుకుంటూ అచ్చంగా ఒకటైన ‘మనం’ 

బంగారూ… చివరగా ఒక్కటిరా… 

నా కళ్ళలోకి తిన్నగా ఒక్కసారి చూడు… 

‘అక్కడ పెనవేసుకుని ఉన్న తడి పొడి క్షణాలన్నీ నీ కోసం అలా కాపు కాసే ఉంటాయి… ఆ రెప్పల కలయిక శాశ్వతమయ్యేదాకా…’ 

ఇట్లు

నీ

ఆత్మైషి

0 comments:

Post a Comment