Tuesday, 10 May 2016

పొడిచే పొద్దు - ఇది మన గురించేగుండెని తడి చేసే బాధలగాథలు సాహిత్యానికి వన్నె తెస్తాయేమో కానీ పరిష్కారాలని చూపించే అవకాశం చాలా తక్కువేమో అనిపిస్తుంది. ఒక బాధలోని గాఢతని మనకి చెపుతూనే దానికి తనదైన ఒక పరిష్కారాన్ని సూచించటం చదువరిలో ఒక ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది కదూ.

‘మనలోకి మనల్ని ఈడ్చుకొచ్చే అనుభవమొకటి ముందు భయపెడుతుందేమో కానీ, ఎక్కడికో అతిధిగా పయనం కట్టిన మెరుపుని మాత్రం మన మనసులోనే శాశ్వతంగా తాపడం చేస్తుంది.’

అనసూయ కన్నెగంటి గారు వివిధ పత్రికల్లో రాసిన కథానికల సంకలనంగా వచ్చిన ‘పొడిచే పొద్దు’ ని చదువుతుంటే నాకనిపించిన భావమిదే.

సమాజంలో మన చుట్టూ ఉన్న సామాన్యుల జీవితాల్లోని నిత్య వ్యధల పరిచయమే కాదు… ప్రతి సమస్యకూ వ్యధలని త్యజించే ఒక పరిష్కార మార్గం చూపిన విధానం, మనిషి మనిషిని చదివాల్సిన కొత్త కొత్త కోణాలని మనముందు పరిచినట్లుగా అనిపిస్తుంది.

ఈ సంకలనంలో 13 కథలు. దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి.

పొడిచే పొద్దు అనే పేరున్న ఈ పుస్తకంలో మొదటి కథ అదే పేరుతో మనల్ని పలకరిస్తుంది. ఒక బాల బడుగు జీవి రక్త సంబంధమైన అక్క ఆరోగ్యం కోసం తన ప్రస్థానం కొనసాగించిన తీరు… ఎవరో మూసేసిన దారి ఒక్కటే కాదు నడవటానికి… సంకల్పం ఉంటే కొత్త దారి…అదీ తన కోసమే వేసినట్లున్న దారి దొరుకుతుంది అన్న ఆశావాద దృక్పథం తో ఇచ్చిన ముగింపు ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక మధ్యతరగతి, మరో బడుగు వర్గపు స్త్రీల వృత్తి జీవితాలపోలికతో ‘నిర్ణయం’ అన్న కథ. అంతరాల్లో తేడాలే కానీ బతుకుల్లో కాదు అన్నట్లున్న తమ తమ జీవితాలపై తమ భర్తల అదుపాజ్ఞల కంచెని దాటటమే ఈ ఇతివృత్తం.

కర్తవ్యం అన్న కథ కూడా భార్యాభర్తల ఇతివృత్తమే. తన సహజ సేవా స్వభావానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న పురుషాధిక్యతని ఒక్క తిరస్కార లేఖతో దునుమాడటం… అలాంటి స్వభావం ఉన్న వారికి ఒక కనువిప్పు.

సమాజంలో ఉన్న లంచగొండితనం ప్రధాన అంశంగా, చివరి వరకూ ఉత్కంఠ కలిగించే కథనంతో సాగిన ఈ కథలో కొసమెరుపు పౌరులుగా మనమేం చెయ్యవచ్చు అన్న ఆలోచన కలిగిస్తుంది.

కష్టంలో మనిషికి మనిషి సాయం ఇతివృత్తంగా రాయబడ్డ ‘శీతాంశుముఖి' అన్న కథ తరిగిపోతున్న మనవ సంబంధాల ఆవశ్యకతని గుర్తు చేస్తుంది.

ఇక బంధం అన్న కథ… ఇంటింటా ప్రతి అమ్మా చదవాల్సిన కథ. ఈ కథలో పసి వయసులో పొడ చూపుతున్న అల్లరి మనస్తత్వాన్ని, ఎంత సున్నితంగా పారద్రోలాలో చెప్పటంలో రచయిత్రిగా కన్నా ఒక మానసిక శాస్త్రవేత్తగా కనిపించారు.

భిక్షాటన నేపధ్యపు ‘చిక్కుముడి’, రైతుబజార్లో పల్లె మనిషి నేపధ్యపు ‘నిజాయితీ’ రైతుకీ పశువుకీ ఉండాల్సిన అనుబంధాల నేపధ్యపు ‘అనుబంధం' చక్కని తెలుగు కుటుంబపు రక్తబంధాల ఆప్యాయతల నేపధ్యంలో ‘కనిపించేదేవుడు' ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనకి ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదంటూ సరదాగా సాగే కథనంతో సాగిన ‘ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం…’ తోటి అనాధ కోరిక కోసం తీర్చటం కోసం తన చిరకాల ఆశయాన్ని పక్కన బెట్టిన విశాలమైన పాత్ర చిత్రణతో ‘కనుచూపు మేరలో ‘ కల్తీ మద్యపు ఇతి వృత్తంతో ‘కలతలన్నీ కరిగేవేళలో’

ఇలా ప్రతి కథా దేనికదే విలక్షణ ఇతివృత్తంతో మన తోటి సమాజాన్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. రోజూ చూసే వ్యక్తుల వెనక ఉండే గాధలు మనకి కళ్ళకి కట్టినట్లుగా పరిచయం అవ్వటం వల్ల ఇకపై మనం వ్యక్తి జీవితాలని విభిన్న కోణాలలో అర్ధం చేసుకునేలా సాగాయి ఆయా కథనాలు.

ఇలా రాయాలంటే ఎన్ని జీవితాలని దగ్గరగా పరిశీలించాలో… అదీ కళ్ళతో మాత్రమే కాదు మనసుతో. వాస్తవిక సమాజాన్ని ఇంత సరళంగా చెప్పగలగటం రచయిత్రికి కథ నడపటంలో ఉన్న పట్టుని చూపుతుంది.

ఒక నవలని ఆపకుండా చదవటం అన్నది మామూలు విషయమే కానీ, కథా సంకలనాన్ని అలా చదవటం కష్టం ఏమో అనుకున్న నాలాంటి మామూలు చదువరితో ఏకబిగిన చదివించిన ‘కథా శిల్పమూ… వస్తు వైవిధ్యమూ’ నిండిన ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన విధానంలో ఏవైనా లోపాలుంటే అవన్నీ నావి మాత్రమే.

0 comments:

Post a Comment