Tuesday, 3 May 2016

స్వయంవరం


పాత టైర్లు… కంపుగొట్టే డ్రమ్ములతో నిండి ఉండాల్సిన గంగులు గాడి డెన్ కనిపించలేదు అక్కడ… హడావిడిగా తిరుగుతున్నమగ నర్సులు, చింకి పోయిన చాపల మీద కళ్ళూ నోరు తప్ప వళ్ళంతా కట్లు కట్టబడి వెల్లికిలా పడున్న ఆకారాలతో హాస్పిటల్ వాతావరణం కనపడుతుంది. ‘ఇదేమిటి వారం క్రితం సుబ్బరంగా విలన్ డెన్ లా వెలిగిపోయిన గంగులు గాడి స్థావరాన్ని హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడు కొన్నారు? కొంటిరి పో... బెడ్ లు కూడా ఏర్పాటు చెయ్యకుండా చింకి చాపలమీద ఈ అంతరిక్ష ఆకారాల్ని పడుకోబెట్టటం ఏమిటి? అదియునూ సరియే అనుకుందాం… ఒక్క ఆడ నర్సు కూడా లేకుండా మగవాళ్ళని నర్సులుగా పెట్టుకోవటం ఏమిటి?. ఇంతకూ ఇప్పుడీ గంగులు గాడిని ఎక్కడ పట్టుకోవాలి’ వర ప్రసాద్ కి పిచ్చెక్కినట్లయింది. ఇంతలో ఒక మూలనుండి ‘షాజ్...షాజ్…’ అంటూ ఒక గొంతు పీలగా వినిపించింది. వరప్రసాద్ చుట్టూ చూశాడు కానీ ఆ పిలుపు ఏ ఆకారపు ఆక్రందనో అర్ధం కాలేదు. ఒక్కొక్క ఆకారాన్ని పరికించుకుంటూ ముందుకు కదులుతుంటే ఒక మూలగా కాస్త భారీగా ఉన్న ఆకారమొకటి తనకు చేతనైనంత వరకూ కాళ్ళూ చేతులు కదిలిస్తూ వర ప్రసాద్ చూపు తన మీద పడాలని ఆరాట పడుతూ కనిపించింది. వరప్రసాద్ తన దగ్గరకు వెళ్ళాడు. పిలుపు వచ్చింది తన దగ్గరి నుండా కాదా అన్నట్లుగా చూస్తుంటే, ఆ ఆకారం నుండి మళ్ళీ ‘షాజ్’ అన్న పిలుపు వినిపించింది. ‘గంగులు డెన్ ఎప్పుడు మార్చాడు? ఈ హాస్పిటల్ ఏమిటసలు? మీరంతా ఎవరు? ఈ కట్లు ఏమిటి? షాజ్… షాజ్ అని పిలుస్తున్నావ్? ఇంతకీ షాజ్ ఎవరు?’ ప్రశ్న మీద ప్రశ్న వేసేసి అలుపు తీసుకుందామన్నట్లుగా ఆగాడు. అబ్బా… ఛాన్స్ ఇచ్చావ్ పోరగా అనుకుని ఆ ఆకారం నోరు పెగల్చుకుంది ‘షాజ్…ణణ్ణు ఘుర్ఘా ఫట్టాల్డా.. ణేణూ.. ఘాంగ్రీల్’ అంటూ ఏదో చెప్పుకుపోతుంది. ఆ ఆకారం ఏమంటుందో ఒక్క ముక్కా అర్ధం కాని వరప్రసాద్ అటూ ఇటూ బిత్తర చూపులు చూశాడు. ఈయన గారి బిత్తర చూపులు పసిగట్టిన నడివయసు డాక్టర్ ఒకాయన అక్కడికి వచ్చాడు. ‘చెప్పండి సర్… నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను’ అన్నాడు వరప్రసాద్ ముఖంలోకి తేరిపార చూస్తూ. ‘ఇప్పుడు నేనేమీ మీ సహాయం అడగలేదే’ ‘అడగలేదన్నది నిజమే కానీ… మీ బిత్తర చూపులు అవీ చూస్తుంటే మీకు నా సహాయం చాలా అవసరం అని అర్ధం అయ్యింది' ‘మీరన్నది నిజమే… ఇదిగో ఈ ఆకారం లో ఉన్న ప్రాణి ఏదో చెప్తుంది కానీ నాకు ఒక్క ముక్కా అర్ధం కావటం లేదు. మీకేమైనా అర్ధం అయితే చెప్తారా డాక్టర్ …’ ‘డాక్టర్... ఎముకల్రావ్…’ తన పేరు చెప్పాడా డాక్టర్. ‘ఓకే ఓకే … డాక్టర్ ఎముకల్రావ్ గారు. తను ఏమంటున్నాడో అడిగి చెప్పండి.’ డాక్టర్ ఆ ఆకారం వైపు తిరిగి ‘ నాకు చెప్పవోయ్ నువ్వేం చెప్తున్నావో ఇతనికి. నేను అనువాదం చేస్తాను’ అన్నాడు. ఆ ఆకారం చాలా కష్టపడి... ఆయాస పడి… ప్రపంచంలో ఎక్కడా వినబడని కొత్త భాషలో డాక్టర్ కి ఏదేదో చెప్పింది. అదలా చెప్తున్నంత సేపూ ఆ భాషా సౌందర్యానికి భయపడి వరప్రసాద్ చెవులు మూసుకున్నాడు కానీ డాక్టర్ మాత్రం చాలా నింపాదిగా విన్నాడు. ఆయనలా వింటుంటే వర ప్రసాద్ మాత్రం భయం భయంగా డాక్టర్ చెవుల వైపే చూస్తున్నాడు ఏ క్షణంలో అక్కడ రక్తప్రవాహం మొదలవుతుందా అని. కానీ అలాంటి ప్రమాదం ఏమీ లేకుండానే డాక్టర్ ఎముకల్రావ్ వరప్రసాద్ వైపు తిరిగి ఆ ఆకారం చెప్పిన మాటలని యధాతధంగా అనువదించాడు. ‘సార్… నన్ను గుర్తు పట్ట లేదా... నేనూ.. గంగుల్ని. మీరు చెప్పిన పని మీద నా గ్యాంగ్ తో ఓ లేబర్ బస్తీకి వెళ్ళాను. ఫలానా రోజున ఈ వాటర్ టాంకర్ మాకు కావాలి అని చెప్తూ ఉండగానే, మాట కూడా పూర్తవకుండా అక్కడ ఆడంగులంతా భద్రకాళీ అవతారాలెత్తి చేతుల్లో ఉన్న బిందెలతో… కాగులతో రణరంగంగా మార్చేసారు సారూ… పేరుకే రణరంగం అంటున్నాగానీ అంతా వన్ సైడెడ్ అయిపొయింది సార్. ఇంతకుముందు ఎప్పుడు ఆ బస్తీకి వెళ్ళినా మమ్మల్ని చూస్తేనే తలుపులకి గడెట్టుకుని గజ గజ వణికిపోయే ఆడంగులు… అసలు పట్టుమని పది మందికూడా ఉన్నారో లేరో సార్… అటువంటిది పాతికమంది వస్తాదుల్లాంటి నా మనుషులని ఎముకలలో సున్నం మిగలకుండా చితగ్గొట్టేసారు. ఇన్నాళ్ళ నుండి వేలమంది బొక్కలిరిచినా, వందలమంది పీకలు కోసినా ఇసుమంతయినా వంటి మీద గీత పడలేదు సార్ … ఇప్పుడు మా బాడీలు రబ్బరు బొమ్మల్లా అయిపోయాయి సార్… అతికించడానికి కూడా ఎముకలే దొరకటం లేదంటున్నాడు ఈ డాక్టర్. లేకపోతే ఒక్క వాటర్ టాంకర్ నీళ్ళ కోసం పది మంది ఆడవాళ్ళు పాతిక మంది రౌడీ వస్తాదుల్ని ఆకారాలు మిగలకుండా ఇంత వికారంగా కొట్టటమేంటీ… ఇదంతా నీ ప్లాన్ కదూ… నిజం చెప్పండి సార్... నువ్వు మా గ్యాంగ్ ని ఏరి వెయ్యటానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ వి కదూ… ప్రాణ సమానమైన వాటిని ఎవరైనా ఆక్రమించుకుంటుంటే ఒక్కో మనిషిలో ఎంత తెగువ ఉంటుందో ఎంత శక్తిని బయటకు తియ్యవచ్చో తెలిసి మరీ మాకు స్పాట్ బెట్టినట్లున్నావ్ సార్… ఇక నుండీ బుద్ధిగా ఉంటాం సార్... ఇంకెప్పుడూ రౌడీయిజం చెయ్యం సార్… ఈ ఒక్క సారికి మాఫ్ జేయండి సార్...’ అంతా విన్న వర ప్రసాద్ కి నవ నాడులూ స్తంభించిపోయాయి. ఓహో ఇది గంగులు గాడి డెన్ గానే ఉందన్న మాట. టెంపరరీ హాస్పిటల్ లా మారిపోయిందన్నమాట. ఇంత పెద్ద రౌడీ కూడా ఒక్క వాటర్ ట్యాంకర్ నీళ్ళు తీసుకుని రాలేకపోవటమే కాకుండా నన్ను పోలీస్ అనుకుని భయపడిపోయాడంటే… ఇక సిటీ లో ఏ రౌడీ వల్ల కూడా ఈ ప్లాన్ వర్కౌట్ అవదని అర్ధం అయ్యింది. ఇంకేదైనా ప్లాన్ చేసి గడువు రోజుకల్లా నీళ్ళు సంపాదించాలి అని మనసులో అనుకుంటూ… ‘డాక్టర్ ఎముకల్రావ్ గారూ… ఈ గంగులు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు.. మీకేమిటి ఇంత చక్కగా అర్ధం అయ్యింది.?’ అన్నాడు. ‘మరేమీ లేదు ఆఫీసర్… ఇలాంటి వాళ్ళని ట్రీట్ చేసీ చేసీ మాకు ఈ భాష పట్టుబడింది' వరప్రసాద్ నిజంగానే పోలీస్ అఫీసర్ అని మనసులో ఫిక్స్ అయిన డాక్టర్ ఎముకల్రావ్. ‘అది సరే గానీ డాక్టర్… నర్సులుగా అందరూ మగవాళ్ళే ఉన్నారేమిటి…?’ ‘ముందు లేడీ నర్సులే ఉన్నారు గాని, ఆడగొంతు వినబడినా, గాజుల చెయ్యి కంటబడినా ఈ వస్తాదులంతా బెంబేలెత్తి పోతుంటే వాళ్ళని పంపించేసి అందరినీ మగవాళ్లనే పెట్టాను ‘ చెప్పాడు ఎముకల్రావ్. ఇక అడగటానికి ఏమీ లేక వరప్రసాద్ బయటకి నడుస్తుంటే ‘ చూడండి ఆఫీసర్… ఈ సారి రౌడీలని ఏరేసే ఇలాంటి ప్రయోగం ఏ బస్తీలో చెయ్య బోతున్నారో చెప్తే, అక్కడ కూడా మా డోర్ డెలివరీ హాస్పిటల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం’ అని ఇంకేదో అంటున్నాడు డాక్టర్ ఎముకల్రావ్. ‘అమ్మో ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను నేనే పోలీస్ ఆఫీసర్ ని అనుకునేలా ఉన్నాను’ అనుకుంటూ డాక్టర్ మాటలు వినపడనట్లుగా పరుగులాంటి నడకతో అక్కడి నుండి బయట పడి ఇంట్లో తేలాడు వరప్రసాద్. ప్లాన్ - A ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ప్లాన్ - B అమలు చెయ్యాలి. ఇంతకూ ఆ స్నేహిత్ గాడు ఏమి చేస్తున్నాడో ఏమిటో… పాండురంగం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ డిటెక్టివ్ పాండురంగం గాడు ఎప్పుడూ ఇంతే. చివరి నిమిషం వరకూ టెన్షన్ పెట్టేస్తాడు. అంతలోనే పాండురంగం నుండి కాల్ వచ్చింది. స్నేహిత్ రోజూ ఆఫీస్ కి ఇంటికీ తిరగటం తప్ప, వేరే వ్యవహారాలేమీ జరపడం లేదని, ఫోన్ కాల్స్ కూడా అనుమానాస్పదంగా ఏమీ లేవని పాండు రంగం తన రిపోర్ట్ చదివి చెప్పాక అంతవరకూ నయమేలే అనుకుంటూ వరప్రసాద్ కాస్తంత కుదుట పడ్డాడు గతంలోకి జారుకుంటూ. *** ‘చూడండి ఫ్రెండ్స్ మీరిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకే సారి ప్రపోజ్ చేసారు. ప్రత్యేకంగా నేనంటూ ఎవరినీ ప్రేమించలేదు కాబట్టి, ఒకళ్ళని యాక్సెప్ట్ చేస్తే రెండో వాళ్ళు ఫీల్ అవుతారు. నాకు అలా ఇష్టం లేదు. ఎవరో బయట వాళ్ళని చేసుకోవటం కన్నా, నన్ను ఇష్టపడ్డ మీలో ఒకరిని చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎవరిని అనేదే సమస్య. మీరిద్దరూ అన్ని విషయాల్లో సమ ఉజ్జీలే అనిపిస్తారు. అందుకే మీ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునేందుకు మీ ఇద్దరి మధ్య ఒక చిన్న పరిక్ష పెడతాను. అందులో నెగ్గిన వాడినే పెళ్లి చేసుకుంటాను. ఇందుకు మీకు సమ్మతమేనా? ’ అని అడిగింది కవిత, ఒకే సారి వచ్చి తమ తమ ప్రేమని వెల్లడించిన వరప్రసాద్ & స్నేహిత్ లని. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు గుర్రుగా చూసుకుంటూ అలాగే అన్నట్లుగా తల ఊపారు. వాళ్ళకి అంతకు మించిన ఆప్షన్ మాత్రం ఏముంది కనుక? ‘సరే అయితే... ఇద్దరూ ఒప్పుకున్నారు కాబట్టి నా పరీక్ష ఏమిటో చెబుతున్నాను. వచ్చే ఏడాది మే 4 వ తారీఖున కస్తూర్బా సేవాశ్రమానికి ఒక ఫుల్ వాటర్ టాంకర్ నీళ్ళు డొనేట్ చేస్తాను అని నేను మాట ఇచ్చాను. ఆ డొనేషన్ మీరు చెయ్యాలి. అలా చేసిన వాడిని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను.’ ఆమె చెప్పింది వినగానే ఓస్ ఇంతేనా అన్నట్లుగా వరప్రసాద్ సంబరపడిపోయాడు. మళ్ళీ అంతలోనే ఒక అనుమానం వచ్చేసింది ‘ మరి ఇద్దరమూ నీళ్ళు డొనేట్ చేస్తే… ఎందుకంటే ఇద్దరమూ స్థితిమంతులమే. ఒక ట్యాంక్ నీళ్ళు ఇవ్వటం మాకు పెద్ద లెక్కలో పని కాదు.’ ‘ఓహ్.. అలా అంటావా, సరే ఐతే ఇప్పుడే టాస్ వేద్దాం. టాస్ ఎవరు గెలిస్తే వారికే వాటర్ డొనేషన్ కి మొదటి ఛాన్స్. ఇది ఇద్దరికీ ఇష్టమేనా' ఇద్దరూ కూడా ఇష్టమేనన్నట్లు తల ఊపారు. టాస్ వరప్రసాద్ గెలిచాడు. ఇక తన సంబరానికి అంతే లేదు. టాస్ గెలిచేసాను కవిత తనదైపోయినట్లే అనుకుంటూ కలలోనే వరల్డ్ టూర్ వేసుకుని కవితతో డ్యూయెట్ పాడేసుకున్నాడు. టాస్ ఓడిపోగానే స్నేహిత్ ముఖం చిన్నబోయింది. ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదనుకుంటూ ఇద్దరికీ బై చెప్పి ఇంటికి వెళ్లి పోయాడు. ‘కవితా… పరీక్ష అంటే ఏదో స్వయంవరంలా ఉంటుందని ఫీల్ అయ్యాను. టాస్ వెయ్యగానే విన్నర్ ఎవరో తేలిపోయేటంత చిన్న పరీక్ష పెడతావనుకోలేదు. ఎనీ వే… ఐ యాం లక్కీ గై.’ అని తెగ సంబరంగా అన్నాడు వరప్రసాద్. ‘సరేలే ప్రసాద్… చిన్నదో పెద్దదో పరీక్ష గడువు ఇంకా తొమ్మిది నెలలు ఉంది కదా. ఆ రోజున నేను చెప్పింది చెయ్యి చాలు’ అంది కవిత చిరునవ్వుతో. ‘అలాగే… అలాగే’ అని కవితకి వీడ్కోలు చెప్పి హుషారుగా కూనిరాగం తీసుకుంటూ ఇంటి ముఖం పట్టాడు వరప్రసాద్. ** చూస్తుండగానే ఆరు నెలలు గడచి పోయాయి. ఈ ఆరు నెలల్లో స్నేహిత్ తన ఇల్లు కొంచెం రీ మోడలింగ్ చేయించుకున్నాడు. వర ప్రసాద్ మాత్రం మే 4 ఎప్పుడు వస్తుందా అన్నట్లు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్యాలెండరులో గడువు మూడు నెలల నుండి రెండు నెలల్లోకి వచ్చేసరికి ఊళ్ళో ఎక్కడ చూసిన వాటర్ ప్రాబ్లం మొదలయ్యిందని వార్తలు చదివి కొంచెం గాభరా పడ్డాడు. మొదటి సారిగా వర ప్రసాద్ లో కాస్త జంకు మొదలయ్యింది. అప్పటికప్పుడు డిటెక్టివ్ పాండురంగాన్ని కలసి స్నేహిత్ మూవ్ మెంట్స్ మీద నిఘా పెట్టాడు. వాటర్ కోసం తానేమైనా ప్రయత్నాలు చేస్తుంటే తనకి రిపోర్ట్ ఇవ్వమని. ఆ తరువాత వాటర్ టాంకర్ ని బుక్ చెయ్యటానికి ఊరంతా పిచ్చి కుక్కలా తిరిగాడు కానీ 6 నెలల వరకూ ఒక్క టాంకర్ వాటర్ కూడా ఇవ్వలేనంత అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయని తెలిసింది. ఇంట్లో బోర్ నుండి వచ్చే వాటర్ ని స్టోర్ చేద్దాం అనుకుంటే అది ముక్కుతూ మూలుగుతూ 5-6 బక్కెట్ల కన్నా ఎక్కువ నీళ్ళు ఇవ్వటం లేదు. అవేమో రోజూ వారీ అవసరాలకే సరిపోవటం లేదు. ఇలా లాభం లేదు దౌర్జన్యంగా అయినా సరే ఒక టాంకర్ నీళ్ళు సంపాదించాలి అనుకుని ఎవరెవరినో అడిగి గ్యాంగ్ స్టర్ గంగులు అడ్రెస్స్ పెట్టుకుని మే 4 ఉదయానికల్లా ఒక టాంకర్ వాటర్ కావాలని చెప్పి తనతో ఒక లక్ష రూపాయలకి బేరం కుదుర్చుకున్నాడు. ఫలితం చూస్తే ఇది. *** గతం లో నుండి బయటకి వచ్చి, నెక్స్ట్ ప్లాన్ ఏమిటా అని ఆలోచించాడు. ఇంతలో బుర్రలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు ఊళ్ళో వాటర్ దొరకక ఖాళీగా ఉన్న ఒక పెద్ద వాటర్ టాంకర్ ని డ్రైవర్ మల్లేష్ తో సహా మాట్లాడుకుని, ఇప్పటికిప్పుడు బయలు దేరి హిమాలయాల్లోకి వెళ్లి ఏ గంగానది నుండో, లేదా బ్రహ్మపుత్ర నుండో ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడి నుండి తీసుకుని రమ్మని అతన్ని బయలు దేర తీసాడు. మల్లేష్ తో ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉండి, తను వాటర్ దొరికాయ్ అని చెప్పగానే ఎట్టి పరిస్థితులలోనూ మే 4 పొద్దున్న కల్లా కస్తూర్బా సేవాశ్రమానికి వచ్చెయ్యాలి అని చెప్పి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకున్నాడు. *** మే 4, 2016, కస్తూర్బా సేవాశ్రమం. కవిత, స్నేహిత్ & వరప్రసాద్ ఆశ్రమం గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. ‘ప్రసాద్… ముందుగా నీదే కదా ఛాన్స్ ఏదీ వాటర్ టాంకర్? ‘ అని అడిగింది కవిత. ‘ఇంకో అయిదు నిమిషాల్లో వచ్చేస్తుంది కవితా…!’ అంతకు ముందే మల్లేష్ తో ఫోన్ లో మాట్లాడిన వరప్రసాద్ కవితతో చెప్పాడు. అంతలోనే వాటర్ టాంకర్ వస్తూ కనిపించింది. ‘అదిగో టాంకర్ వచ్చేసింది… కవితా ఇక నువ్వు నా దానివే' వరప్రసాద్ ముఖంలో వేయి మతాబుల కాంతులు, చేతల్లో గంతులొక్కటే తక్కువ. ఇంతలో మల్లేష్ డ్రైవింగ్ సీట్ లో నుండి కిందకి దూకి సరాసరి అమాంతంగా వరప్రసాద్ కాళ్ళ మీద పడి ‘ స్వామీ… నువ్వు దేవుడివి స్వామీ… నువ్వు దేవుడివి… గంగ తోనే నా బతుకు ముడి పడి ఉందని నా బతుకుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ కైలాసం నుండి వచ్చిన గంగాధరుడివి స్వామీ…’ అని అన్నాడు. ఒక్క క్షణం పాటు తను విన్నదేమిటో అసలేం జరుగుతుందో తాను దేవుడవ్వడం ఏమిటో... ఏమీ అర్ధం కాలేదు వర ప్రసాద్ కి. అయినా తమాయించుకుని ‘అది సరే కానీ మల్లేష్... టాంకర్ లోపలి కి తీసుకుని వెళ్లి నీళ్ళని ఆశ్రమం లో ఇచ్చేసేయ్' అన్నాడు ‘నీళ్ళని లోపలి తీసుకుని వెళ్ళటానికి టాంకర్ ఎందుకు సాబ్, ఈ మరచెంబు చాలు. అయినా పవిత్ర గంగాజలం. మీకోసం అనే జాగ్రత్తగా దాచి తెస్తే ఆళ్ళకి ఇవ్వమంటారేంది స్వామీ ’ అంటూ తన చేతిలోని రాగి మరచెంబుని చూపించాడు. ‘మర చెంబేమిటి… నేను చెప్పేది… టాంకర్ లో నీళ్ళ గురించి' పెద్దగా అరిచేసాడు వరప్రసాద్ అసలు జరిగేదేమిటో మనసుకెక్కక. ‘టాంకర్ లో నీళ్ళు లేవు స్వామీ… మన రాష్ట్ర పొలిమేరల్లోకి రాకముందే మొత్తం అమ్మేసాను. వచ్చే దారిలో ఎక్కడ చూసినా నీళ్ళు లేవనుకుంటా. బిందె వెయ్యి రూపాయలన్నా ఎగబడి ఎగబడి కొన్నారు. ఇదిగో మీరిచ్చిన లక్ష రూపాయలకి ఇంకో లక్ష వేసి మీ డబ్బులు మీకిచ్చేస్తున్నా. నాకో నాలుగు లక్షలు మిగిలాయ్. ఈ 2-3 నెలలు ట్రిప్పులు కొట్టుకుంటే నా లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది స్వామీ… నువ్వు దేవుడివి స్వామీ… నీ ఋణం ఉంచుకోను. ప్రతి ట్రిప్పులో నీ ముడుపు నీకిచ్చేస్తా… మళ్ళీ వస్తా స్వామీ’ అంటూ ఆ మర చెంబుని వర ప్రసాద్ చేతికిచ్చి తన టాంకర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే వరప్రసాద్ నేలమీద పడి మూర్ఛిల్లినట్లయ్యాడు. స్నేహిత్ మరచెంబులోని నీళ్ళని వరప్రసాద్ ముఖం మీద జల్లి తనని లేపి కూర్చోబెట్టాడు. కాస్తంత తేరుకున్నాక, వరప్రసాద్ తన బెట్టు వీడకుండానే సరే నా వాళ్ళ కాలేదు ‘నీ నీళ్ళు ఎక్కడ? అని అడిగాడు ‘అదిగో ఆశ్రమంలో నీళ్ళు సప్లై చేసేసి బయటకు వస్తుంది కదా. అదే స్నేహిత్ తెచ్చిన వాటర్ టాంకర్. నువ్వు పడిపోయినప్పుడే అది లోనికి వెళ్ళింది.’ అంది కవిత పక్కనుండి. ‘ ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వాళ్ళ కాలేదు, అసలు నీకు నీళ్ళు ఎలా దొరికాయి?’ దేభ్యం ముఖం పెట్టుకుని మరీ అడిగాడు వర ప్రసాద్ స్నేహిత్ ని ‘మరేం లేదు మిత్రమా… వాన నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ప్రిజర్వ్ చేసుకునే సిస్టంతో మా ఇంటిని రీ మోడలింగ్ చేయించాను. అలాగే ఇంటి చుట్టూ ఇంకుడుగుంతలు తవ్వించాను. ఇప్పుడు మా ఇంటిలో పుష్కలంగా నీరు. అందుకే ఇంత నీటి ఎద్దడి లో కూడా ఇబ్బంది పడకుండా తీసుకుని రాగలిగాను’ వరప్రసాద్ నోట మాట లేదు. ఇంతలో కవిత అందుకుంది ‘ చూడు ప్రసాద్… ఆ రోజు ఇంత చిన్న పరీక్షా అన్నావ్… జీవితం మీద అవగాహన లేని వాడికి అతి చిన్న పరీక్ష అనుకున్నదే జీవితాన్నే మింగేసేంత పెద్ద సమస్య అవుతుంది. అందుకు ఇదే పెద్ద ఉదాహరణ. నీకు ముందు చూపు లేదు... ప్లానింగ్ లేదు… పైగా సమస్య తీవ్రమైనప్పుడు గంగులు లాంటి రౌడీలతో లాలూచి పడి వక్రమార్గం ఎన్నుకున్నావ్. ఇది సరైన దారి కాదు మిత్రమా. రోజు రోజుకీ నీటి సమస్య ఎంత తీవ్రమవుతుందో మనం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాం. కానీ నువ్వు మాత్రం దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నావ్. చివరికి ఏమైంది? మనిషికి తమ వనరుల మీద అవగాహన ఉండాలి. ప్రకృతితో చెలిమి చేస్తూ తనని మాలిమి చేసుకోవాలి. అప్పుడే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. నాకు కావాల్సింది నన్ను ప్రేమించేవాడే కాదు… జీవితం మీద సంపూర్ణ అవగాహన ఉన్న వాడు కూడా. అది స్నేహిత్ లో ఉంది. నువ్వు మాత్రం ఇకనైనా మారు మిత్రమా..!’ అంటూ స్నేహిత్ చెయ్యి అందుకుని ఆశ్రమం లోపలికి నడచింది.


0 comments:

Post a Comment