ఏయ్ హనీ...
నీ వెంట్రుకలు... ఓహ్! సారీ నీ శిరోజాలు... ఊహుఁ నీ వినీల కుంతలాలు... మళ్ళీ సారీ నీ అమోఘమైన కేశసంపద... అబ్బా ఇంకేమని వర్ణించాలి...
నీ శిరోజాలు పట్టుదారాల కన్నా మృదుత్వంతో... ధన్బాద్ బొగ్గు కన్నా నల్లగా నిగనిగ లాడుతూ కృష్ణవేణి పాయల్లా నీ వెన్నుపై జీరాడుతుంటే... అబ్బా! తలచుకుంటేనే చాలా ఆనందంతో మనసు పులకరిస్తుంది. కాటుక పులిమినట్లున్న నీ వెంట్రుకలు నల్ల బంగారపు దారాల్లా నా మనసుని దోచి వేస్తున్నాయి.
పాల మీగడ రంగులో ఉన్న మల్లెలు.. సన్న జాజులు నీ జడలో ఎలా ఉన్నాయో తెలుసా? అమావాస్య చీకటిలో ఉదయించిన ధృవ తారల్లా ఉన్నాయి. నీ సిగలో తురిమిన కనకాంబరాలు నిశీధిలోకి సూర్యుడు అస్తమిస్తున్న భావాన్ని కలుగ జేస్తున్నాయ్.
పూజకి పనికి రాని పుష్పం ఉంటుంది అంటూ ఉంటారు కానీ నీ సిగని తాకని కుసుమం లేదు. నీ వాలుజడలో చోటుకోసం ప్రతికుసుమం ఉవ్విళ్లూరుతుంది. దైవార్చనలో పునీతం కాకపోయినా నీ సిగకు అర్పితమైతే సార్ధకత లభిస్తుందని ఆ కుసుమాలు నాతో భాషించాయి. కలువలు చందమామ కోసమే పూస్తున్నట్లు తాము నీ సిగలో చేరే అదృష్టం కోసమే పుష్పిస్తున్నామని ఆ కుసుమాలు నాతో చెప్పాయి.
ఆ చిరు కుసుమాల్లాగానే నీ విశాలమైన కొప్పులో ఓ కుసుమంలా ఒదిగి పోదాం అని ఉంది. ఎందుకంటే నీ వాలు జడలో వయ్యారంగా ఒదిగినప్పుడు వచ్చే ఆ ఆనందాన్ని నేనూ పొందాలని ఉంది. ఆ కుసుమాలు ఎందుకు నిన్ను వదలమంటూ ఉన్నాయో తెలుసు కోవాలి.
జడలా అల్లిన నీ కురులు కాటుక పులిమిన నల్లతాచులా ఉన్నాయి. అసుర సంధ్య వేళ అరకువేలి అందాలతో పచ్చని ప్రకృతి మధ్య సెలయేటి పరవళ్ళలో గోధుమ వన్నె బండరాళ్ళపై నువ్వు కూర్చుని ఉన్నప్పుడు చంద్రబింబము వలే వెన్నెల కురిపిస్తున్న నీ ముగ్ధ మనోహర మోముపై పడుతున్న కురులు.. ఆ.. కాదు కాదు ముంగురులు నీకో వింత అందాన్ని సంతరింప చేస్తున్నాయి.
నీ పాల చెక్కిళ్ళపై ఎగురుతున్న ముంగురులన్నీ కలసి ఎలా ఉన్నాయో తెలుసా... ఇంద్రుని వాహనమైన ఐరావతాన్ని చుట్టుకుని ఉన్న తక్షక సర్పంలా ఉన్నాయి.
ప్రియా ఎలనాగులాంటి నీ వాలుజడ వయ్యారంగా నీ నడుముపై నాట్యమాడుతుంటే ప్రవరాఖ్యుడికైనా నీ మీద మనసౌతుందేమో... ఇది తెలిస్తే అల్లసాని వారికి ఎంతటి అప్రదిష్ట.. తన కథానాయకుని ప్రధాన లక్షణాన్ని నువ్వు పాడు చేశావని నీ మీద పగ పెంచుకుంటాడేమో...
నీ వాలుజడ రహదారిలో మల్లెల రథాలెక్కి నీ వయ్యారంలోని సింగారంగా మారిపోవాలని కోరుకుంటూ...
నీ
...రేష్






0 comments:
Post a Comment