Tuesday, 26 August 2014

వెన్నెల కుసుమం - 21 (ఇది ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)

ఏయ్ హనీ...

పట్టుకుచ్చులకి నీ కురులకి ఉన్న తేడా ఏమిటో నాకు అర్ధం కావటం లేదు ఒక్క రంగులో తప్ప. నల్లటి నీ కురుల మృదుత్వం  పట్టుదారాల కన్నా ఎంతో శోభాయమానంగా ఉంది.

ప్రాయాన్ని తెలిపే కొన్ని శరీర అవయవాల్లో (ఏయ్ ప్రేమ దేవతా... కురులను అవయవం అనకూడదనుకుంటా.. అయినా సరే ఇక్కడ మాత్రం అలా రాయక తప్పటం లేదు) ముఖ్యమైన వెంట్రుకలు నీ విషయంలో మాత్రం తమ అశక్తతని వ్యక్తం చేయవచ్చు.

ఎందుకంటావా...! భవిష్యత్ లో నీకు వయసు మీదకు వస్తున్నప్పుడు కూడా నిత్య నూతనం గా ఇప్పుడున్నంత నలుపు రంగులోనే ఉంటామని ధవళ వర్ణం అంటే ఎలా ఉంటుందో నీ తలకు తెలియకుండా చేస్తామని నీ  కుంతలాలు  నాతో చెపుతున్నాయి మరి.. 

మ వరకూ ఎన్ని వత్సరాలైనా అనుక్షణం నిన్ను నిత్యయవ్వనవతిగానే ఉంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. అవి అలా అంటుంటే ఆ కురుల అందం నిత్యవసంతమై నాతోనే ఉంటుంది కదా అని నాకెంత ఆనందమో నీకు తెలుసా...

నీ కురులలో తురిమిన మల్లెలు ఎలా ఉన్నాయో తెలుసా... లోకం మీద తిమిరం పంజా విసిరినప్పుడు జాబిల్లి  నుండి జాలు వారిన వెన్నెల కుసుమాల్లా ఉన్నాయి. ఆ క్షణం నీ సిగను చూసిన తారలన్నీ సిగ్గుతో మబ్బుల మాటున దాక్కుంటున్నాయి... ఎందుకు అంటే... భువిలో తమ వెలుగుల కన్నా కాంతి వంతమైన  వెలుగులు నీ సిగ  నుండి వస్తుంటే తమ విలువ పడిపోతుందని.

తల స్నానం చేసి కురులకి సాంబ్రాణి ధూపం వేస్తూ ముని వేళ్ళతో సుతారంగా చిక్కు తీస్తుంటే నీ సంగతి ఏమో కానీ నాలో కలిగే తన్మయత్వం చెప్పతరమా?

నీ జడ జావళీలతో నాలో కలిగే విరహోద్రేకాలు వర్ణింపతరమా?  సుమ సమీరాలు నీ శిరోజాలతో జతచేరి అలనల్లన విన్యాసాలు చేస్తుంటే పులకిస్తున్న నా మనసు విలాసాలు రాయ తరమా?

ఆ కారుమబ్బుల చీకటి కాటుకై  నీ తలపై రాలి నీ కురులకి శ్యామ వర్ణం అద్దింది కదూ... చందన వర్ణపు చెక్కిళ్ళ  మీద శ్యామ మేఘాలు జాలు వారుతున్నట్లు గా ఉన్న నీ కురులని చూస్తున్నప్పుడల్లా.... ఓహ్... నీ సొగసు చూడ తరమా?

నీ కురుల కౌగిట్లో నలిగిపోవాలని తహ తహ లాడే విరుల విరహపు లీలలు వింటుంటే నీ సిగ గా మారలేని నా దురదృష్టం నన్ను వెక్కిరిస్తుంది.

వెన్నెల దుప్పటి కప్పుకుని  నా గుండె సవ్వడిని నీ చెవులతో వింటున్నప్పుడు నీ కురులే కదా మన్మథ మంత్రాలుగా మారి మరులు గొల్పుతూ నను మత్తెక్కిస్తూ...

ఇంతకు ముందోసారి నే చెప్పిందే అయిన మరోసారి చెప్పకుండా ఉండలేక పోతున్నాను  ‘నీలి నీలి  నీ వినీల కుంతలాలు చూసిఅవి మేఘాలు కాబోలునని భ్రమించి అచ్చట చేరిన నక్షత్రాలు తామరవిరిసిన మల్లియలయినాయట’ 

ఇంతకన్నా నీ కురులని ఎక్కువగా వర్ణిస్తే ఏ  దిష్టి తగులుతుందో ఏమో...

నీ
... రేష్ 

1 comments:

Post a Comment