Saturday, 16 August 2014

ఉత్తరానికో ఉత్తరం


ఓ తోకలేని పిట్టా...

ఏ దిక్కుకి ఎగిరి పోయావమ్మా...

నువ్వొస్తున్నావంటే అమ్మ కళ్ళల్లో కొడుకే వచ్చినంత వెలుగు వచ్చేదంట... పైకెళ్ళి పోయిన తాతయ్య చెప్పాడు. అమ్మ రాసిన ఉత్తరాన్ని ఎన్ని సార్లు చదివినా అదే జీవం నిండిన పలకరింపు ఎదురుగా నిలబడి మాట్లాడినంత సరికొత్తగా వినపడుతూ ఉండేది. సెల్ ఫోన్ లో అవే అమ్మ మాటలు వింటుంటే ఆ కాసేపే ఆనందం. ఫోన్ పెట్టేసాక మళ్ళీ మళ్ళీ ఆ పలకరింపులోని మాధుర్యం మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫోన్ చెయ్యాల్సిందే... అదే అమ్మ పలకరింపుని అక్షరాల్లో గుదిగుచ్చి నాకు మళ్ళీ మళ్ళీ అందించావ్.

అమ్మ ప్రేమని అక్షరాల్లో చూపుతూ నాన్న భాధ్యతని మనియార్డర్ రూపంలో తీసుకోచ్చేదానివి. చెల్లి నచ్చిందన్న పెళ్లి వారు రాసినప్పుడు... అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందన్న కబురు తెచ్చినప్పుడు ఎనలేని సంతోషాన్ని ఇచ్చావ్... తాతయ్య మరిలేడన్న వార్తని తీసుకు వచ్చి మమ్మల్ల్ని కన్నీళ్ళలో ముంచేసి జీవిత గమనం అంటే ఇంతేనని పరిచయం చేసావ్. ఇప్పుడూ ఇలాంటి విషయాలు వార్తలు ఫోన్ లో వింటున్నాం. కానీ ఈ క్షణం వచ్చిన ఆనందాన్ని ఓ పదేళ్ళ తరువాత గుర్తు చేసుకోవాలంటే ఈ ఫోన్ లో ఏమి విన్నానో ఏమి గుర్తుంటుంది అంటావ్... అదే నిన్ను తడిమితే చాలు జ్ఞాపకాల ముత్యాలు కుమ్మరిస్తావ్ మదిలో ఆనందాలు వర్షిస్తూ
.
ఇక కాలేజీ కుర్రకారుకి నువ్వంటే ఎంత ఇష్టమో ఏమని చెప్పేది. పోకిరీగా... కనిపించిన ప్రతి పిల్లకి ఏదో ఒకటి రాసిచ్చి కాలేజీ ప్రిన్సిపాల్ తో తల అంటించుకునే పోరంబోకులనుండి స్వచ్చమైన ప్రేమని అందమైన ఊసులని అక్షరాల్లో ఒదిగిస్తూ కాలం చెల్లని ప్రేమని వెల్లడి చేసే రాసే అమర ప్రేమికుల తొలి ప్రయత్నానివి నీవేగా. మెచ్చిన చెలికాని నుండి ప్రేమలేఖవై వచ్చిన నిన్ను క్షణానికోసారి కళ్ళకి హత్తుకుంటూ అక్షరాల వెంట పరుగులు తీస్తూ పడచు కన్య మోమున చిరుసిగ్గుల్ని పరిచయం చేసావ్.

దేశ సరిహద్దుల్లో ప్రాణాలని ఫణంగా ఒడ్డి పోరాడుతున్న వీర సైనికులకి ఎప్పుడూ కుటుంబపు అప్యాయతని కళ్ళకి కట్టినట్లు చూపెడతావ్.

పెళ్ళయి అత్తవారింట్లో అడుగు పెట్టిన ఆడపడచు క్షేమ సమాచారాలన్నీ కన్నవారికీ... ఆఫీస్ పని మీద క్యాంప్ కి వెళ్ళిన కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి రాసిన ప్రణయాక్షరాలనీ... అమ్మా నాన్నలకి దూరంగా హాస్టల్లో ఉండి చదువు కుంటున్న బిడ్డకి కన్న తల్లి చెప్పే జాగ్రత్తలని అతి జాగ్రత్తగా మోసుకు వచ్చి మరో తల్లివయ్యేదానివి.

ఇంతటి ఘన చరిత్ర ఉన్న నీవు ఇప్పుడు కేవలం ఆఫీస్ వ్యవహారాల ఉత్తర ప్రత్యుత్తరాలకీ, అప్పుల పాలైన రైతు బిడ్డల ప్రాణాలవిసేలా చేసే బ్యాంకు నోటీస్ లకి మాత్రమే పరిమితమైన నిన్ను చూసి నాలాంటి వారు ఎంతమంది కుమిలి కుమిలి పోతున్నారో నీకేం తెలుసు.

నువ్వు రూపం మార్చుకుని ఏ మెయిళ్ళ రూపం లో వచ్చినా మాకు తృప్తిలేదే...

కొత్త కొత్త టెక్నాలజీలతో వస్తున్న ఈ మెయిళ్ళు చదవటం డిజిటల్ స్క్రీన్ మీద బాగుంటుందేమో కానీ నిన్ను చేతులతో పట్టుకునో మరీ ఆనందాన్ని ఇస్తే గుండెకు హత్తుకునో నీ అనుభవించే తృప్తిని అవి ఇవ్వగలవా...?

అందరి సంగతీ ఏమో కానీ ఈ మెయిళ్ళూ... సెల్ ఫోన్లూ.... నాలోపలి పొరలని ఏ రోజునా మనసారా తట్టిన పాపాన పోలేదు.

ఒకదాని తరువాత మరకటి తారీఖుల వారీగా నిన్ను పేర్చుకుంటూ పోతే చాలదా జ్ఞాపకాల వీచికలు వీయడానికి... ఆత్మకధల అవసరమే లేకుండా, పాత తారీఖులు గుర్తుకు తెచ్చుకోవటానికి కొత్తగా తంటాలు పడకుండా... నన్ను నేను ఆత్మావలోకనం చేసుకోవటానికి... ఒక్కొక్కరుగా వీడ్కోలు చెప్పిన ఆత్మ బంధువులని మరో సారి గుర్తు తెచ్చుకోవటానికి నీకన్నా వేరే మార్గం ఉందంటావా?

ఎప్పుడైనా వంటరితనం నను తడుతుందేమో అన్న భయం లేదు ఓ మనసైన ఉత్తరం నా చేతిలో ఉండగా...

ఇట్లు,

సురేష్ రావి

1 comments:


బాగుంది.పాతతరం వాళ్ళంతా అదే ఫీలవుతున్నారు.

Post a Comment