Friday, 15 August 2014

వెన్నెల కుసుమం - 17 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)


హనీ...

అసలెవరవు నీవు... శాపవశాత్తూ దివినుండి భువికి జాలువారిన ప్రణయ కుసుమానివా... నాకు కనిపించిన క్షణం వరకూ ఎవరి కంటా పడినట్లు లేవు కదా...అలా పడి ఉంటే ఒక్కొక్కరూ నిన్ను పిచ్చిగా వెర్రిగా ఆరాధిస్తూ పోటీ పడితే నీ అందం కోసం ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగేవో కదా...

నువ్వు ఈ పృధ్విపై తిరుగాడుతుంటే ఆనందించేది నేను ఒక్కడినే కాదేమో...! ఇప్పటి వరకూ మోడు వారిపోయినట్లు ఉన్న ఈ ప్రకృతిని చూడు. కొత్త అందాలని ఎలా సంతరించుకుందో నీ స్పర్సతో... ఇప్పటి వరకూ ఒకే రాగం పాడుతున్న ఈ కోయిలమ్మని చూడు క్షణానికో కొత్త రాగం తీస్తున్నది.

ఎండకు ఎండి వానకి తడుస్తూ ప్రాణం లేవని చెప్పబడుతున్న ఈ బండరాళ్ళని చూడు... కొత్తగా తమలో గుండె ఏదో పుట్టినట్లుగా నీ వైపు ఎంత ఆరాధనగా చూస్తున్నాయో...! ఒక్క క్షణం తమకి కూడా పక్షుల వలే విహంగాలైతే ... మనుషుల్లా మాటలు వస్తే నీ చెవుల దగ్గరకి చేరి ఏవో ఊసులు చెప్పేలా ఉన్నాయి.

నిన్ను చూసిన సంతోషం లోనే అనుకుంటా పెనుగాలి సైతం నీ దగ్గరకు వచ్చి చిరుగాలిగా నీ మేనిని స్పృశిస్తుంది.

వెండి కలసిన వెన్నెల మంచులో కరిగి ద్రవంగా మారి నీ వంటిపై స్వేదంగా ప్రకాశిస్తున్నట్లు ఉంది. మంచి గంధపు సువాసనలీనే నీ తనువు నాలో అణువణువునా తపనలు రేపుతుంది.

తారలతో సరస సల్లాపాలు ఆడుతున్న ఆ చంద్రుడు నీ కోసం వెన్నెల జాలాలు విసురుతూ పడుతున్న అవస్తలు చూస్తున్నావా... రతీదేవిని కూడా మరచి పోయి నీ పైకి పూల బాణాలని సంధిస్తున్న మన్మధుడిని గమనించావా?

వసంత మాసం కాకపోయినా నీవున్న ప్రతి చోటునీ వసంత వనం లా మార్చుతున్న ఆ వసంతుడు ప్రతి ఋతువు లోనూ తానే పని చేస్తానని బయలు దేరాడు... బహుశా ఎప్పటికీ నీకు దగ్గరగా ఉండి నిన్ను ఆకట్టుకోవచ్చు అన్న దూరాలోచనతో కాబోలు.

శచీదేవితో ఛలోక్తులు విసురుతూ సరస సల్లాపాలు ఆడుతూ ఉన్న ఆ దేవేంద్రుడు అదాటున నిన్ను చూసి మరుక్షణమే అమరావతి నుండి భువిపైకి ప్రయాణ సన్నాహాలు చేస్తున్న విషయం విన్నావా?

తపస్సు చేస్తున్న నిరాహారులైన మునులు రంభ ఊర్వశి మేనకల్ని తిరస్కరిస్తూ తమ తపోభంగానికి నిన్ను పంపాలని ఆహార దీక్ష మొదలు పెట్టారట.

మానవులంతా ముక్త కంఠంతో అందమంటే నిర్వచనం ఇప్పుడే తెలిసిందని అదీ నిన్ను చూసిన తరువాతనే అని ఎలుగెత్తి చాటుతున్నారు.

శాస్త్రవేత్తలంతా వెండి, బంగారం,ప్లాటినం కన్నా ఖరీదైన లోహం ఏదైనా నీ శరీరం లో దొరుకుతుందేమో అని నిన్ను అపహరించటానికి కుట్రలు మొదలు పెట్టారట.

ఏయ్ హనీ...

భువి మెచ్చిన కీర్తి నీది
దివి కంటిన ఖ్యాతి నీది
నీవు తెలియని తావు లేదు
నీవు చూడని చోటులేదు

నీ
...రేష్

1 comments:

ఈ ఉపమానాలన్నీ చదువుతూ ఉంటే... తనని చూడాలని అనిపిస్తుంది...

Post a Comment