Tuesday, 19 August 2014

వెన్నెల కుసుమం - 18 (ఇది ఎన్నడూ ముగియని ఓ ప్రణయ లేఖ...)


హనీ...

మానస సరోవరపు సంగీతంలో హిమాలయ పర్వత సానువుల మీద రజత కాంతులీనుతూ మంచు వర్షిస్తున్న సమయాన నీ అధరామృతాన్ని నా అధరాలతో త్రాగాలని ఉంది. నీ శరీరం లోని అణువణువునీ నా అధరాలతో శోధించి కొత్త ప్రాంతాలు కొత్త విశేషాలు నీలో ఏమున్నాయో తెలుసుకోవాలని ఉంది.

అల్లంత దూరాన గోదావరిలో పడవ నడిపేవాడి పాట వింటూ కోనసీమ అందాల మధ్య నీ తనువునే వీణగా నా చేతి వేళ్ళతో శృతి చెయ్యాలని ఉంది.

చిట్టడవిలో ఓ చిన్న మంచెపై వెన్నల కిరణాల దుప్పటి కప్పుకుని నీలోని అణువు అణువునీ నీ శోధిస్తుంటే నువ్వు నా శరీర భాషని చదివి నా చెవిలో మంద్రంగా వల్లెవేయాలి ప్రియతమా...

ఆరుబయట తన వెన్నెల కిరణాల సాక్షిగా మన ప్రణయకేళీ విలాసాలు సాగుతుంటే ఆ చందమామ మోము చిన్న బోయి తన గోడు తారలతో చెప్పుకునేందుకు తరలి పోడంటావా?

నాలోని  జీవాన్ని నీ దగ్గరే వదిలి వేస్తున్నా... నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీ ఇచ్ఛ వచ్చినట్లుగా దాని వాడుకో నా హృదయమా...!

సాగరం మధ్య ఒంటరి దీవిలో మన ఇరువురం మాత్రమే ఉండి ఇంకో ఇంకెవ్వరూ లేకుంటే... ఓహ్... తలచుకుంటూనే ఎంత మధురంగా ఎంత సంతోషంగా ఉంది. కలల్లో తేలిపోతున్నాను కల్లలు కాకుండా చూడవూ...

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం లోని శకుంతలలా నీవు వనసీమలలో విహరిస్తుంటే ఆ వన కన్యని మోహించిన దుష్యంత మహారాజులా నీ సాన్నిహిత్యాన్ని పొందగలిగే అదృష్టం ప్రస్తుత కాలం లో అలాంటి ఒంటరి దీవిలోనే కదా వచ్చేది? కాకుంటే ఆ దుష్యంతునిలా నేను మాత్రం నిన్నెన్నడూ మరువను. పూలతలే నీ వంటి ఆభరణములుగా ధరించి సువాసనా భరితమైన కుసుమాలని చూర్ణం చేసి నీ తనువుపై రంగరించి నీవు నా చెంతన తిరుగుతుంటే ఓహ్! మనసు పులకరిస్తుంది.

ప్రియతమా ... ఇంత ఆనందం నాకు కలిగిస్తున్న నీకు నేనివ్వగలిగే బహుమతి ఏమున్నది నా ఈ చిన్ని హృదయం తప్ప... నా ఈ వెన్నల కుసుమం నీది కాదని సందేహం ఏదైనా ఉంటే అది తీరటానికి మరో సారి చెపుతున్నా నువ్వంటే నాకిష్టమని నువ్వే నా ప్రాణమని నేను నిన్ను ప్రేమిస్తున్నానూ అని. అర్ధం అయ్యింది కదా నా మనసులోని మాటేమిటో...

కాల గర్భాన కలిసి పోతున్న ప్రేమ కధలన్నీ మన ప్రేమకు ఆదర్శమవ్వాలి... కాబోయే ప్రేమికులకి కొత్త సిలబస్ లా మన ప్రేమకధ నిలవాలి. దానికి నీ వంతు సాయం చెయ్యవా ప్రియా... నీకై అనుక్షణం తపిస్తున్న నా మనసులోని బాధని నా ఈ చిన్ని గుండె తట్టుకోలేక పోతుంది. అనుదినం కొన్ని వేల లీటర్ల రక్తాన్ని శుద్ధి చేసే తనకి ఈ అదనపు భారం ఏమిటా అని విలపిస్తుంది.

నా హృదయం సంతోషంతో పులకరించాలంటే నీ ప్రేమ బంధాన్ని ప్రతి క్షణం నీ మనసులోని ఊహలని ఆశలని నా మనసుతో పంచుకో...!

అంతులేని బాధల మంటల్లో కాలిపోతున్న
నా మనస్సుకు నవనీతంలా పనిచేసేది
నీపై నా మనస్సులో ఉన్న ప్రేమ మాత్రమే.
ప్రపంచంలో ఏ దొంగా దొంగిలించ లేనిది మనస్సు
కానీ
మనస్సుని దొంగిలించ గలిగేది ప్రేమ అనే కొంటెదొంగ మాత్రమే.

కరిగిపోతున్న కాలంలో రూపుమారకపాషాణమై నిలిచేది ప్రేమయేగా

నీ
.. రేష్

0 comments:

Post a Comment