వ్యక్తిత్వంలేని అస్తిత్వంలో
తాము కోల్పోయిన జీవితంలో
నన్ను పోతపోయటానికి
సిద్ధమవుతున్న కొత్త కొత్త ప్రణాళికలు
ఇంకా మొదలవ్వని బతుకుకు వేస్తున్న సంకెళ్ళై
పంజరానికి అంటుగట్టే అమాయక కుట్రగా
అక్కడ ఎవరో నన్ను లిఖిస్తున్న చప్పుడు
నన్ను కనుగొనే అవకాశం నాకు మిగల్చనిచోట
ఎవరో నిర్దేశించిన గమ్యాల వైపు నడక మొదలెట్టటం
గాలివానలో దీపంగా నిలవాలనుకోవటమే
నేను కళ్ళు తెరవాల్సిన చోట
వారు సిద్ధం చేసే వెలుగులే
నన్ను శాశ్వత తిమిరంలో కప్పెట్టేస్తే
ఓ నిండైన ఖాళీతనంగా ముగిసిపోతానేమో
నావైన జాడలు మిగల్చకుండా
ఎవరి కలల ఎంగిలిగానో కొనసాగుతూ
వెళ్ళిపోవటం కన్నా
ఈ ఉమ్మనీటి సంద్రంలో
రూపుదిద్దుకోని పిండంగానే రాలిపోవాలని ఉంది
అలా కుదరదంటారూ…
కొత్త కలలకీ…
కొత్తగా వేసే అడుగులకీ చోటివ్వండి మరి






1 comments:
అధ్భుతంగా వ్రాశారు
Post a Comment