Friday, 4 September 2009

ఒక నాయకుని మహాభినిష్క్రమణం....మరి తరువాత?


మర్రిచెట్టుకింద మరే చెట్టూ ఎదగదన్నట్లు, మన రాష్ట్రం లో సమకాలీన కాంగ్రెస్ నాయకుల్లో మహానాయకుడైన వై.ఎస్.ఆర్ ముందు మిగిలిన నాయకులందరూ వెలవెల బోయారు. కాంగ్రెస్ లో ఇంతగా ప్రజలతో మమేకమైన నాయకుడు ఇంకొకరు లేరు. ఇప్పుడప్పుడే రావటం కూడా చాలా కష్టం. నాయకులు చాలా మంది ఉండి ఉండవచ్చుకానీ రాష్ట్రవ్యాప్తం గా ప్రజాదరణ కలిగిన నాయకుడు & మార్గదర్శి గా ముందుండి వై.ఎస్.ఆర్. కలలు గన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలిగే సామర్ధ్యం ఉన్న నాయకుడు ఇప్పుడెవారున్నారు కాంగ్రెస్ లో?

వై.ఎస్.ఆర్. అంత్యక్రియలన్నా పూర్తి కాకుండానే వారసుడు ఎవరు అన్న ప్రశ్న ఉదయించటం సహజమే జగన్ ని ముఖ్య మంత్రి ని చెయ్యాలన్న కొంత మంది కాంగ్రెస్ మంత్రుల & శాసన సభ్యుల ఆత్రుత చూస్తుంటే ఏదో శవ పంచాయితీ లాగా అనిపించింది. వీళ్ళు హడావిడిగా వెళ్లి చిరంజీవి ని జగన్ కి మద్దతు ప్రకటించమనటం చూస్తుంటే అప్పుడే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠం గురించి కుమ్మలాటలు మొదలయ్యాయి అన్న అనుమానం ఒక సామాన్య పౌరుడిగా నాకే వస్తుంటే ఇక మిగిలిన వర్గాల్లో & రాజకీయ పక్షాల్లో ఏమనుకుంటూ ఉంటారు.

ఒక పక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా రోశయ్య గారు ప్రమాణ స్వీకారం చేస్సరు. కాబట్టి ఇప్పుడింత హడావిడిగా జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యక పోతే రాజీనామాలు చేసేస్తాం అనటం చూస్తుంటే ఇదో రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తం గా వై.ఎస్.ఆర్. మృతికి వెల్లు వెత్తుతున్న సానుభూతి ఈ సమయం లో జగన్ పేరు తెరపైకి తెచ్చిన తరువాత మరొకరి పేరు తెరపైకి వస్తే ఇంకేమైనా ఉందా?. సరిగ్గా అదే కావాలి వాళ్లకు. అందుకే ఇలాంటి విషాద సమయం లో మంత్రి వర్గ తీర్మానం చేసేటట్లు చేసారు.

మరి మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా?

ఎన్నికల ముందు అడ్డమైన వాగుడూ వాగి ఓడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల వారు ఇప్పుడు ముఖ్యమంత్రి సంగతికి తొందరేం లేదు అన్నారు. చిరు ఆ మాట అన్నారంటే వేరే పార్టీ వ్యక్తి కాబట్టి అర్ధం చేసుకో గలం కానీ డి.ఎస్. ఆ మాట అన్నారంటే జగన్ ని ఆయన ఆమోదించనట్లే కదా?

మరో ముఖ్య నేత జే.సి. దివాకర్ రెడ్డి గారు కూడా జగన్ ని ముఖ్య మంత్రి గా చెయ్యమని విన్నపం మీద సంతకం చెయ్యమని తనను ఎవరూ అడగలేదు అన్నారంటే ఆయన గారి మనసులో ఏమున్నట్లు? మరో మాట... గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు నేను ముఖ్యమంత్రి రేసు లో లేను అని ఎందుకు సెలవిచ్చినట్లు? (ఆడవారి మాటలకు కాదు.... రాజకీయుల మాటలకు అర్ధాలు వేరు కదా!)

ఇంకా ఇప్పటికే జైపాల్ రెడ్డి, పురంధరేశ్వరి, బొత్సా తదితరుల పేర్లు షికార్లు చేసాయి.

వై.ఎస్.ఆర్. మిస్ అయిన దగ్గర నుండి హోం మినిస్టర్ ని పక్కన పెట్టేసి మీడియా ముందు అధికారిక ప్రకటనలు చేస్తున్నప్పుడే అర్ధం అయ్యింది రోశయ్య గారి అంతరంగాన ఏమున్నదో. (ముందు పెద్ద మనిషిగా భాధ్యత తీసుకున్నారని భ్రమ పడ్డాను). రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటూ ఎవరూ లేరు ముఖ్యమంత్రే ఉండేది అన్నప్పుడే అర్ధం అయింది అంతా బాగుంటే సెంట్రల్ లో మన్మోహన్ లా స్టేట్ లో తానే అని భావిస్తున్నాడని.

ఇంకా ఇప్పటి వరకూ బయట పడని నాయకులెందరు ఉన్నారో...

జగన్ ని ముఖ్యమంత్రి ని చెయ్యాలని అంటున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే తండ్రి చెయ్యి పట్టుకుని నడక నేర్చుకుంటున్న వాడికి ఒకేసారి పట్టాభిషేకం ఏమిటా అని ఎందుకు ఆలోచించటం లేదు?

జగన్ కి రాష్ట్ర ప్రజల సాధక బాధకాలు అర్ధం చేసుకోవటానికి, ముఖ్యమైన రాజ్యాంగ పదవులధిరోహించుకోవటానికి ఇంకొంత సమయం ఇస్తే బాగుంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల్లో వై.ఎస్.ఆర్. తరువాత ప్రజల్లో ఆదరణ ఉన్నది వై.ఎస్.ఆర్. కన్నా బిడ్డగా జగన్ కే. అది కాదన లేని సత్యం. అంత మాత్రాన ఇప్పటికిప్పుడు జగన్ చేతికి ముఖ్యమంత్రి పగ్గాలు అందిస్తే 15 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ లో మనం తరచుగా చూసిన అసమ్మతి రాగాలు మళ్ళీ పురివిప్పుతాయనటం లో అతిశయోక్తి లేదు.

కేంద్రం లో ప్రధాని పదవికి నాకు అనుభవం చాలదన్న రాహుల్ లా ఇక్కడ కూడా రాజకీయాల్లో ఇంకా అనుభవం పెరిగే వరకూ జగన్ వేచి చూసి అందరికీ అమోద్యయోగ్యమైన వివాదరహితుడైన (ఉదా: జైపాల్ రెడ్డి )వ్యక్తి చేతికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా చొరవ చూపిస్తే తన తండ్రిలా జగన్ కూడా భవిష్యత్తులో మంచి నాయకుడు కాగలదు.)

లేదంటే రాష్ట్ర కాంగ్రెస్ మళ్ళీ 15 సంవత్సరాల క్రితం పరిస్థితి కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

ఈ విషయం లో కేంద్ర నాయకత్వం ఒక మంచి నిర్ణయం తో తెలుగు ప్రజల కి సంతోషాన్ని కలగచేస్తారని ఆశిస్తూ.......

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

5 comments:

నేను కూడ మీతో ఏకీభవిస్తున్నానండి....
నా అభిప్రాయం కూడా అదే....

I do agree with your idea. Jaipal Reddy is a perfect suit for the CM post taking the current situations into consideration. Gud analogy :)

congrss chivariki oppukunna ibbandi petti edipinchi istundi, edaina vurake icheste dani viluva teliyadu evarikaina, dasari,subbarami reddi vishayam lo ilane jarigindi.

Post a Comment