Monday, 2 February 2015

హేమంత స్పర్శ - 7

నా నవ జీవనమా.…
వరి కంకులని  స్పృశిస్తూ వంటికి చల్లదనాన్ని అంటించి వెళుతున్న పైరగాలికీ…  వెన్నెల దారుల బాటసారివై...  నా  మనసు రహదారిపై నిత్య సంచారివై నడయాడే నీకూ... నిత్య పరిమళపు మకరందాలూ సరి రావేమో…

ఏయ్… ఒక్కోసారి నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా… ‘వత్సరానికోసారి వచ్చే వసంతం ఉంది చూశావూ… దానికి పచ్చదనపు వన్నెలద్దే వనదేవతవు నువ్వేనేమో’ అని.

ఎందుకలా అంటే కారణం కోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు… నువ్వు లేనప్పుడు సంవత్సరానికి ఒక్క సారి  కుంటుకుంటూ నన్ను పలకరించే వసంతం… ఇప్పుడు… అనుక్షణం  నన్ను చుట్టుకునే ఉండి పోతుంది… మరి అప్పటికీ ఇప్పటికీ తేడా నువ్వేగా…

నీ పేరొక్కటి చాలు  నాలో వివశత్వం  వెల్లివిరియటానికి… నా మనసుకు  విరహమద్ది  దేహానికి  ఆరాటం పెంచి  నాలో  నన్ను భ్రమని చేస్తూ నీతో నన్ను లయించుకుంటూ పరవశాల శాలువాలో ఒదిగి పోవటానికి….

నాకు అర్ధం కానిది ఒక్కటేరా… ‘అసలు ఒక మనిషి మీద ఇష్టా ఇష్టాలు ఎలా మొదలవుతాయి?’  ఒకే ప్రాణంగా కలిసి పోవటానికి దగ్గర దారులేమిటి అని…

కేవలం  అందం చూసి అనుకుందాం అనుకుంటే చరిత్రపుటల్లో లిఖించబడ్డ అందాలనీ తిరస్కరించిన వారెందరో కదా ఈ లోఖంలో… అయినా అశాశ్వతమైన అందాలతో కేవలం ఇష్టాలు మొదలవ్వొచ్చునేమో కానీ  రెండు జీవితాలు ఒకే ప్రాణం అవుతాయా… కష్టం కదూ…

అసలు ప్రాణానికి ప్రాణంగా మారటానికి దగ్గర దారి అంటూ ఉంటుందా ఏమి?

మనసుల ముడికి ప్రేమొక ఇంధనమవ్వాలి
మదిలోని ఆణువణువూ ఒక తపనతో రగలాలి…
ప్రజ్వరిల్లే ప్రతి ఆలోచనా తానై  నిండాలి…
తలపు తలపులో తేజస్సుగా వెలగాలి
ఊపిరికొక ఊహ పుట్టాలి…
ఒకే శ్వాసగా శాశ్వతమవ్వాలి…

ఇదంతా ఒక్క అందంతో సాధ్యమేనా… అందంతో దేహాల్ని అంటుగట్టెయ్యటం చాలా సులువు కావొచ్చేమో కానీ మనసుల్ని అంటుగట్టగలమా?  కష్టం కదూ…  

చిరు ఎండ తాకిన చెరువు బంగారు వర్ణంలో కనిపిస్తుందని  అందులోని నీరంతా స్వర్ణజలం అని అనుకుంటారా ఎవరైనా…?  మంచితనపు ముసుగులూ అంతే… ముసుగుతోనే అర్ధం అవుతుంది అది నమ్మదగ్గది కాదని… కాసేపు మనిషిని  మభ్య పరిచే మాయాజాలాలు ఎన్ని ఉన్నా ఒక్క సారి అంతరంగం చదవటం మొదలు పెట్టామా… ఎక్కడెక్కడి మకిలీ బయట పడిపోతుంది.  

అయినా గానీ నాకు తెలిసినంతవరకు మనసు ప్రధానంగా ఉన్న వాటికి  దగ్గరి దారి అంటూ ఏమీలేదు… మంచి వ్యక్తిత్వం  తప్ప. ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయిన నీ వ్యక్తిత్వం  గురించి నేను కొత్తగా  చెప్పటానికి ఏముందిరా…!

నీ

నేను…

0 comments:

Post a Comment