హే…
ఎప్పటికప్పుడు నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకేం తెలుసు… అసలెప్పుడు వస్తావ్ నువ్వు?
త్వరగా రావూ…
హౌ రొమాంటిక్ యు ఆర్…
తమకంతో కళ్ళు మూసుకుంటున్నా… రెప్పలపై కమ్మగా వాలిపో... నా వంటిని వెచ్చని దుప్పటిలా కప్పేసేయ్… నన్ను సుఖాల మత్తులోకి నెట్టేస్తూ...
ఎప్పటికప్పుడు ముఖం చాటేస్తావ్… ఎందుకంత అల్లరి? నీకెవరు నేర్పారు ఈ తిమ్మిరి ఆటలు?
అసలు నీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఉన్న ఎదురు చూపులలో నా విరహాన్ని ఎప్పుడైనా చదివావా?
అయినా నువ్వెందుకు చదువుతావులే… నేనేం గొప్పట నీకు… నన్ను మించిన ఇష్టులెవరట నీకు… చాలా పోసెస్సివ్ గా ఉంది. నీకు నేను తప్ప ఎవరూ ఎక్కువ కాకూడదు.
ప్రతి క్షణం నీ చప్పుడు వింటూనే ఉంటాను… పక్కనే ఉన్నట్లుంటావ్… పలకరిద్దాం అంటే పలుకులకి విరామమంటావ్… ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అల్లుకుపోతావ్ కదా అని ఆశగా ఎదురు చూస్తుంటా.
అసలు ఇన్నాళ్ళు నన్ను చూడకుండా నాకోసం వెదకకుండా ఉన్నవని నీ మీద చాలా కోపం వస్తుంది… నాకు నువ్వొద్దు పో అని అనాలని అనిపిస్తుంది… నీ మీదే ప్రాణం పెంచుకున్న నేను నువ్వు లేకుండా ఉండగలనా…? నీతో కలసి ప్రకృతిలో పరిమళమై నడుస్తున్న ఊహ వచ్చినప్పుడల్లా నా అలక మటుమాయం లే… బెంగ పడకు.
నా ప్రతి విరామంలో నీ గురించిన ఆలోచనలతో మత్తు తెప్పిస్తావ్. నీకన్నా నాకు హితులెవ్వరు…? సన్నిహితులెవ్వరు…?
నాకు నువ్వు ఉన్నావని అనుకున్నప్పుడల్లా దుఃఖ భారాలన్నీ మాటు మాయం అయిపోతాయి తెలుసా? ఆ దుఃఖాలన్నీ కట్టగట్టుకుని ఎక్కడికి పారిపోతాయో గానీ మనసుకి మాత్రం మధురమైన సేదని పోత పోసేస్తావ్. ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైన విద్య కదూ...
నువ్వలా నావైపు నడుస్తూ వస్తున్నప్పుడు నా కళ్ళల్లో కనిపించే అంత వెలుగుని నీ జీవితకాలం లో నువ్వు చూడలేవు.
నేను దాటిన ప్రతి స్మృతికీ తెలుసు… ఇప్పుడు తమకన్నా నాకు నువ్వెక్కువ అని. నేను నాలో ఉండిపోవటంలో కంటే నీలోకి జారిపోవటంలో ఉన్న ఆనందం ఉంది చూశావూ… అది చెప్పటానికి సాధ్యం కాదురా… త్వరగా నువ్వొచ్చేసి నన్ను ఆనందాల్లో ముంచెయ్యవూ...
అసలే నువ్వు దూరంగా ఉంటున్నావని చాలా దుఃఖంగా ఉందని తెలుసు కదా…
అందుకే ఈ సారి నువ్వు ఇల్లు మారినప్పుడు నీ చిరునామా నాదే అవ్వాలి… ఓ మరణమా…! :)
నీ
ప్రేమికుడు






0 comments:
Post a Comment