Wednesday, 18 February 2015

హేమంత స్పర్శ - 9


రేయ్…

ఒక్కొక్క సారి ఈ ప్రపంచం చేసే చప్పుడు ఎంత చిరాకని అనిపిస్తుందో తెలుసా…?  పిల్లలాడుకునే బంతి మన పక్కన పడితే దాన్ని అందుకుని వాళ్ళ వైపు విసిరేసినట్లుగా ఈ లోకాన్ని చేత్తో ఏటో విసిరేసేయ్యాలి అనిపిస్తుంది. 

నా మాటలు నీకు నవ్వు వస్తున్నాయి కదూ… 

లేకపోతే ఏమిటి మరి?

నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ మనసారా మౌనాన్ని తాగుతూ నిన్ను చదువుదామని  కూర్చుంటానా… మాటల కుప్పని తెచ్చి నా నెత్తిన పడేస్తుంది.  నిన్ను చదవలేక... మనసుకు మౌనం చేరక… నోటికి మాటలు రాక నేను పడే కష్టం ఉంది చూశావూ… చెప్పలేని బాధరా అది.  

కళ్ళకి రెప్పలు ఉన్నట్లు చెవులకి కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మూసుకునే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది...?  ఆ బ్రహ్మకి మనవి చేసుకోవాలి ఈ సారి  కొత్త సృష్టి చేసేటప్పుడు  ఈ విషయం దృష్టిలో పెట్టుకోమని…! 

అసలు ఇలా కాదురా ప్రపంచం ఉండాల్సింది… రెప్ప విప్పిన ప్రతిసారి కొత్తగా కనిపించాలి… కళ్ళు మూసుకునే ముందు గొంగళి పురుగులా అనిపించే ప్రతిదీ… కళ్ళు తెరిసేసరికి సీతాకోక చిలుకలా  మురిపించాలి… అసాధ్యమనుకుంటున్నావ్ కదా… కానే కాదు…

రోజులోని చిరాకులన్నిటినీ కంటి రెప్పల కింద వత్తిపెట్టి… నేను నీ తలపుల తలుపు తట్టి కాసేపు  తన్మయత్వంలో ఓలలాడినాక... బద్ధకంగా విప్పిన రెప్పల సవ్వడి విన్నప్పుడు లోకమెందుకో మేఘాల్లోకి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది.  ఎందుకో ఏముందిలే…  తేడా అల్లా నీ తలపుల సడులే…

అనంతానికి అవధులు వెదికే  పనిలో ఉన్నానిప్పుడు… ఎందుకంటావా…? తలపు వెనక తలపుచేస్తూ  నీ స్మృతులు పరుగులు తీస్తుంటే అట నుండి బయటకు రాగలనా… మరి ఎప్పుడూ  అలానే చేస్తుంటే  ఆఫీస్ లో పని ఎవరు  చేస్తారమ్మాయ్? 

ఎంత కష్టమో తెలుసా ఇష్టమైన పని నుండి బయట పడాలి అనుకోవటం…

ఒక్కోసారి ఒంటరిగా కూర్చుని నీ ఏకాంతంలోకి జారి పడతాను చూడూ… అప్పుడు దూరంగా కనిపిస్తున్న కొండ రాయిని చూసినా… ఆ కిటికీ అద్దం మీద పడి చెల్లా చెదురవుతున్న   నీటి బొట్టు గీస్తున్న ఒక   తడి చిత్రాన్ని  చూసినా…. అల్లనల్లన కదులు తున్న ఆ నీలి మేఘాలు చెక్కుతున్న వాయు శిల్పాలు చూసినా  నీ భంగిమలా అనిపిస్తుంది… నీతో  కలపి  నన్నుకూడా  చూపించేస్తూ  ఉంటాయ్ నా  ఈ ప్రకృతి మిత్రులు... 

అసలు నీకో సంగతి తెలుసా...

“నీలో ఒక మనిషి నిండి పోయి  నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడల్లా  ఆచ్చాదన లేని ఆహ్లాదంగా మనసుని స్పర్శించటంలో ఉన్న ఆనందం…” 
నేను ప్రతి రోజూ ఆ ఆనందపు ధారలలో తడసి ముద్దవుతున్నాను. ఎలాగో అర్ధం అయ్యింది కదూ… నిజమే నాలో నువ్వు చేస్తున్న సవ్వడే  ప్రతి ఓ క్షణాన్ని మన ప్రత్యేక క్షణంగా మార్చేస్తుంది.

మరో సంగతి చెప్పనా…. 

నా కంటిలోని ప్రతి చెమ్మా దుఃఖంలో నుండి పుట్టేది కాదు… అలుపెరుగని నీ కలలతో  అలసిన కళ్ళకి పన్నీరుగా సేద తీర్చాలని పుట్టిన తడి స్పర్శరా.  అసలు జన్మాల నిరీక్షణలో ఉన్నప్పుడు కూడా ఏనాడూ  కన్నీరు నా చెక్కిలి తడమలేదురా… నాకోసం నువ్వున్నావని తెలుసు… నాలాగే నువ్వు కూడా  నా కోసం వెదకుతూ నిరీక్షణలో జన్మాలన్నిటినీ దాటి వస్తున్నావనీ తెలుసు. మరి కన్నీటి స్పర్శ నాకెలా తెలుస్తుంది. నా నీకెలా తెలుస్తుంది. 

ఆ నిరీక్షణలో నిన్ను ఊపిరి తీసుకుంటున్నప్పుడల్లా హృదయాంతరాళంలో ఒక నవ్వు పూసిన చప్పుడు… ఆ నవ్వుల పద్దు రాయాలంటే ఎన్ని సూపర్ కంప్యూటర్స్ కావాలో మరి…

అప్పటి నవ్వులే కాదు... 

ఏయ్ ప్రియురాలా… 

ఇప్పుడు కూడా నా పెదవులు నీకప్పగించేశాను నవ్వుల నెలవంకగా మలుస్తావని… మరెందుకు ఆలస్యం…

నీ
నేను...

0 comments:

Post a Comment