Wednesday, 4 February 2015

హేమంత స్పర్శ - 8

నా జీవితమా….

తెల్ల తామర పూరేకుకున్నంత స్వచ్ఛత నింపుకున్న అతి కొద్ది మందిలో నువ్వూ ఒకదానివి కదూ… అందుకేనేమోరా నును లేత తమలపాకంత సున్నితత్వాన్ని నీ పెదవులకి అద్దుకుంటూ నువ్వు నవ్వే  ఆ  మెరుపు  చూశావూ… అలవోకగా నాలాంటి వాళ్ళని మత్తులోకి నెట్టేస్తుంది….

దిగంతాల నిశ్శబ్దాన్ని ఒక్క పెదవి వంపులో చిరునవ్వుగా విసిరేస్తావ్ చూడూ… మనసంతా జిల్లుమంటూ ఆ నవ్వు వెనుక కొట్టుకుని పోతుంది… మరి నన్ను  నేను ఎలా వెనక్కి తెచ్చుకోనూ? కల్మషం తెలియని  నీ ఒక్క చిన్ని నవ్వు  చాలు  సర్వ  ప్రకృతీ నీకు పాదాక్రాంతం అవ్వటానికి... 

పున్నమికే అప్పిచ్చే నక్షత్ర కాంతులే నీ మనసు  రాల్చుచుండగా… సర్వ వర్ణాల సొబగులన్నీ ఏకమైన సౌశీల్యమే  నీలో చేరి నీ హృదిని మరింత ప్రకాశవంతంగా  వెలిగిస్తూ మనస్కాంతమై  నన్ను నీలో  కరిగించుకునే క్షణాల ముందు పూర్ణ కౌముది కాంతులేమూలకో కదా… 

ప్రత్యూషంలో నీ వన విహారం తలచుకుంటుంటే   వేకువ వడిలో కూర్చుని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి  సుప్రభాతమో... చెరువు గట్టున ఉన్న గుడిలోనుండి ఘంటసాల గళం నుండి మృదు మధురంగా జాలువారుతున్న గీతాసారమో    వింటున్నంత కమనీయంగా ఉంది తెలుసా…

కాంతి కిరణపు జ్వలనంలో వేడెక్కి సెలయేటి నీటి పాటని కప్పుకుంటూ వస్తున్న మలయ పవనమొకటి నీ మందహాసాన్ని తాకి ఓ పరవశాన్ని నా  గుండె నిండా పోతపోసేసి సరి కొత్తగా ఊపిరి తీసుకుంది.  

ఇన్నాళ్ళుగా ఆకాశంలో మాత్రమే ప్రభవించే జ్యోత్స్న తెలిసిన నాకు, నీ కళ్ళ గర్భాన  పునీతుడవుతున్న శీతకిరణుడిని చూసి నీ అంతరంగపు ప్రకాశమేపాటిదో అవగతమవుతూ నీ మీద ఉన్న ప్రేమ అనంతమవుతూ ఉంది. 

ఒక్కొక్క సారి ఏమనిపిస్తుందో తెలుసా బంగారూ… నిన్ను పొందటమే ఈ జన్మ సాఫల్యమని… అసలు నిన్ను కనుగొనటానికే మనసు ఎన్ని వెతలు పడిందో తెలుసా…?  నిన్ను చూసాకే దేహానికీ మనసుకీ పొంతన కుదిరే ఘడియలు ఉంటాయనీ అవి నన్ను పలకరించాయనీ అర్ధం అయ్యింది. 

నాలో... లోలోన ఎక్కడో కొడగొట్టుకుంటున్న ప్రాణ తంత్రులకి నీ రూపే జీవ మయూఖమై... మహతి నాదాలని మించిన  సజీవ రాగాలని నా జీవితానికి  పరిచయం  చేశావు. 

ఇద్దరమూ ఎక్కడో ఉంటాం… ఒక్కటేనంటాం… దేహాల దూరానికి నిష్కల్మష ప్రేమతో నిర్మల హృదయాల  ఊపిర్లు పోతగా పోసి మనసు మాటలతో వేసుకునే వంతెన ఉంది చూశావూ… అది  ఎన్నడూ బీటలు వారని  బంధం కదూ… 

ఎంత దూరానికి అంత విరహాన్ని అంటగట్టి నిన్ను నా నిరీక్షణలో  ఒంపుకుంటున్న క్షణాలు చేసే అల్లరి ఉంది  చూశావూ… ఎంత కోపం వస్తుందో వాటి మీద... ఎప్పుడో ఈ క్షణాలన్నిటినీ మూటగట్టి ఆ దేవుడి మీదకి విసిరి ఆయనకీ విరహాన్ని పరిచయం  చెయ్యాలిరా… 

నువ్వంటూ నాకోసం ఉన్నావన్న ఒకే ఒక్క స్మృతి చాలదూ ఎంత దూరాన్నీ దగ్గర చేసుకోవటానికి… 

హేమంతపు చేమంతులతో  ఉదయపు సావాసం
కుంకుమ వర్ణపు సిగ్గులతో సాయంత్రపు మోమాటం 
సందె చుక్కల బొట్టు పెడుతూ  వెన్నెల పిలచిన పేరంటం 
తిమిరపు మంచె మీద వాలిన నీ కన్నుల మెరుపందం

ప్రకృతి కాంత దివ్య సౌందర్యంలో చిన్ని ఆకులమై పరవశించటంకన్నా ఇంకేం కావాలి...? జీవితాన్ని ఊహించుకోవటానికి... అనుభూతుల్ని ఒంచుకోవటానికి…  

మనసు స్పర్శ తెలుస్తోంది...  నీ నవ్వు వెలిగినప్పుడు... !  నిజంరా అలా అలా ఆహ్లాదంగా నువ్వు నవ్వే నవ్వు ఉంది చూశావూ… నా హృదయాధరాలపై మత్తుగా మెరుస్తుంది. కన్నీటిని చదువుతూ మనసుని తడుపుకుంటున్నప్పుడు  నువ్వు గుర్తొస్తే… ఆ గుర్తుతో పాటు నువ్వు తీసుకొచ్చేది నన్ను సేద తీర్చే  మానసిక ఉపశమనాన్ని కూడా…

నీ 
నేను…

0 comments:

Post a Comment