Tuesday, 10 February 2015

ప్రకృతివే...

ఏయ్ హనీ…

ఇన్నాళ్ళుగా నా కంటిపాపకే అంటుగట్టుకుని తిరిగా బ్రహ్మ రాసిన  ఓ చిత్రాన్ని… 
నా జన్మ... నా బతుకు... నా కలలు… 
అన్నిటిదీ ఒకే లక్ష్యంగా మొదలెట్టా నా పయనాన్ని... 
ఎన్ని యుగాల  వెదుకులాటో ఇది… 
ఎన్ని జన్మాల దూరమో ఇది… 
నీ దగ్గర కొచ్చి అంతమయింది....  

జీవితం యాంత్రికమైన చోట చిత్రంగా చిగురించావ్… 
నా ఆచూకీ నేను కోల్పోయిన చోట నాకో ఉనికినిచ్చావ్…
మౌనం పోత పోసుకున్న చోట మాటవయ్యావ్…
నా రేపటి కోసం నీ నేటిని పూర్తిగా ఖర్చు పెట్టేస్తున్నావ్...
నడక మరచిన నవ్వుకు పరుగు నేర్పుతున్నావ్... 
నా బతుకులో  ఋతుభ్రమణాల లెక్కలూ తప్పించేసావ్ 

ఇంకా చెప్పాలంటే మొత్తంగా నా ప్రకృతివే నీవయ్యావ్...

అసలేంట్రా ఇది… 

ఏమి మాయ చేసావు రా? 

మనసులోకి రాగానే పెదవి మీదకి చేరతావ్… వచ్చిన చోట నిలవవెందుకో… రాగానే  అలా అలా  వంటిలోని అణువణువునీ ఒక్క సారి చుట్టి  తనువునంతా పులకింతల్లోకి నెట్టేస్తావ్…

ఎంత తాగినా దాహం తీర్చవెందుకో నీ ఊసులు… ఇంకా ఇంకా కావాలంటూ మదిని మాయలోకి నెట్టేస్తూ  నన్ను పూర్తిగా నీ వశం చేసేసుకున్నావ్ రా…

ఇంతగా నన్ను సొంతం చేసుకున్న నీకు నేనేం ఇవ్వగలను నా శ్వాసలని లెక్కగట్టి నీ ఊపిరికి అంటుగట్టటం తప్ప…? 

నువ్వొచ్చాక... 
గతం శూన్యమయ్యింది…
ప్రస్తుతం పరిపూర్ణమయ్యింది…

నువ్వు పక్కన ఉంటే ఒక ‘నమ్మకం’ నాతో ఉందన్న భరోసా… 

అసలెప్పుడూ గుండె చప్పుడు వినలేదు… అసలది సవ్వడి చేస్తుందనే మరచిపోయాను.  చిత్రంగా నువ్వొచ్చాకే  నా గుండెకో చప్పుడు ఉందని గుర్తొచ్చిందిది. ఇంతకుముందు అదే సడి చేసేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం  నిన్ను ఒక లయగా శబ్దిస్తుంది… మరి నువ్వొచ్చాకే అది అలా వినపడుతుందా… అది అలా శబ్దిస్తుందని తెలిసి నువ్వొచ్చావా… భేతాళ ప్రశ్నలా ఉంది కదూ… 

అసలు ప్రేమంటేనే ఒక భేతాళ ప్రశ్న ఏమో కదా…?  మనిషి మనిషికి… మనసు మనసుకీ… ఏంతో దగ్గరగా… మళ్ళీ అంతే దూరంగా…. కొందరికి ద్వేషంగా మరి కొందరికి ప్రాణంగా… ఏ ఇద్దరికీ ఒకేలా అనిపించక… సముద్రమంత వైవిధ్యం... 

సాగర కెరటాలకీ నీ ప్రేమకీ ఎంత పెద్ద పోలికో చూసావా? 

తీరానికి ఎప్పుడూ దాహం కలగకుండా తరచి తరచి తడుముతూనే ఉంటుంది కెరటం… ప్రతి సారీ కొత్తగాహత్తుకుంటూ… నీ ప్రేమా అంతే… మదిని ఎప్పుడూ మధురంగా చూసుకుంటుంది. అసలు మొహమొత్తనీకుండా ఎప్పటి కప్పుడు సరి కొత్తగా… ఇంకొంత ఆర్తిగా నన్ను అల్లుకుపోతుంది.  

చెలిమికీ చెక్కిలికీ ఏ జన్మ ఋణాలు కొనసాగుతూ ఉంటాయో కానీ… చెక్కిలి మీదకు ఒక్క కన్నీటి చుక్కని కారనివ్వకుండా చూసుకునే  చక్కని చెలిమిగా నన్ను నడిపిస్తున్నావ్…

నీ ఊసులు తాకినంత మేరా కర్పూరధూళిగా మారి కావలి కాయాలని ఉందిరా…

నువ్వొచ్చాక నా స్వార్ధం హ్రస్వమయ్యింది… ప్రేమ అనంతమవుతూ...

అసలు నేను… నువ్వు…. ఏమిటి ఈ తేడా? అందుకే... ఇదంతా కాదు గానీ… ఈ సంబోధనలకీ అతీతంగా కొత్తగా మారిపోదాం… సరేనా…!

నీ 

నేను...

1 comments:

ఈ లేఖ మొదటిసారిగా చదివాను. ఒకే లయతో త్వరత్వరగా సాగిపోయినట్లు అనిపించింది. ఎప్పటిలాగే ప్రేమని గొప్పగా... సులభమనిపించేలా... రాసారు.

Post a Comment