Wednesday, 4 February 2015

జీవితం తడిమింది...

రేయ్ హనీ...

అక్షరాల్లో ప్రేమని ఒలికించి భావుకతని తాగే నాకు జీవితమై వచ్చేసావ్ రా... నిజంగా ఎంత ఆనందమో తెలుసా... అనుభూతులకే  కొలతలుంటే నా సంతోషాన్ని కొలవటానికి అంతరిక్షమే హద్దేమో... 

ఇలా ఎలా వచ్చేసావ్ రా నాలోకి? బాటంతా  సుమ రేకలు పరిచినంత మృదువైన నడకతో అలా అలా పరిమళాలు జల్లుకుంటూ సూటిగా గుండెలోకే అలవోకగా వచ్చేసావ్... ఎంత ధైర్యమో నీకు... అల్లరి పిల్లా... నా గొంతు వినాలని ఫోన్ చేసాను అని చెప్పావ్ చూశావూ... నిజంగా మనసు నిండి పోయిన మాటరా అది. నా గురించి ఒకరు ఇంతలా ఆలోచన చెయ్యటం ఎంత నచ్చిందో తెలుసా... దాన్ని మాటల్లో ఐతే చెప్పలేను.   

వెన్నెల తునకలేవో  నిన్ను చేరాక నవ్వులుగా మారినట్లు ఉన్నాయి…  ఆ చిరునవ్వులేమో మన్మధ బాణాల్లా సరాసరి గుండెదారి పట్టేస్తుంటాయ్ నిన్ను నా లోకి గుచ్చేస్తూ…   

ఆ సంగతి కాసేపలా పక్కన పెడితే  నవ్వుల వశీకరణ మంత్రమేదో వచ్చనుకుంటా నీకు... అలా అలా వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది రా నీ నవ్వుల సరిగమలని... ఎంత ముద్దుగా నవ్వుతావో తెలుసా నీకు... ఏం పిల్లవో ఏంటో అన్నీ నేనే చెప్పాలి నీకు. 

పొద్దు పొద్దున్నే నన్ను నిద్ర లేపటానికి వస్తున్నరవి కిరణానికి చెబుతూ ఉన్నా… కాసేపలా పక్కకి జరుగూ... ప్రత్యూషపు గాలిలా నన్ను కప్పెయ్యటానికి తను వస్తుందీ అని… పాపం పిచ్చి కిరణం మాయమైపోయింది చల్లగా నిన్ను నా మీద కప్పుతూ… నిన్ను విరహిస్తున్న నా క్షణాలన్నిటినీ ఆవిరి చేస్తూ…

నీ శ్వాసలతో  వెచ్చగా నాకు ఊపిరి స్నానం చేయిస్తూ కళ్ళతో మౌనంగా నువ్వు మెరుపుల మంత్రోచ్చారణ చేస్తుంటే… మనసంతా ఎనలేని నిశ్శబ్దాన్ని ఆవాహన చేశా ఏ శబ్దమూ ఈ అనుభూతిని నాకు క్షణ మాత్రమూ దూరం చెయ్యకూడదని. 

నువ్వో మౌనం పరదా కప్పుకున్న పలుకుల శిల్పానివని  నాకు తెలియదూ…  అందుకేరా శాశ్వతంగా మౌనించిన నా మదిని ఉరకలెత్తిస్తూ చల్లని సెలపాటలా  కాసేపు  నన్ను రగిలించవూ… కాసిన్ని  పలుకులని  పెదవుల  చివరన  అంటించి  చూడు  నా నిశ్శబ్దాన్ని నీ శబ్దంలో కలిపేస్తా…

అయినా గానీ చెలిమి మొదలయ్యాక మనసు మాటలు ఎప్పుడూ  వినపడుతూనే ఉంటాయి కదా…  మరి  మన  మౌనాలకీ మాటలకీ పెద్ద తేడా ఉంటుందంటావా? 

ఎప్పటికీ ఇంతే ప్రేమగా ఉంటావా అంటావ్... నిలువెత్తు బంగారపు మనసుని నేను వదులుకుంటానా? వలచి వచ్చి నా జీవితానికి  వన్నెలద్దిన వెన్నెల దొరసానివి రా నువ్వు. ఎప్పటికీ మన జీవితాల్లో ఆ వెన్నెలలూ అలా కురుస్తూనే ఉంటాయ్…

కావాలంటే మన పరిచయమయ్యాక నువ్వు ఇంకిన ప్రతి క్షణాన్ని అడిగి చూడు అది నన్ను దాటకుండా నిన్నుచేరిందేమో …  నిత్య వసంతాన్నై నీలో శ్వాసిస్తున్నా  ఆనందాన్నే స్పర్శిస్తున్న ప్రతి  మన క్షణంలో…  నువ్వు  స్పర్శించని నా క్షణాలు ఇకపై  మిథ్య… 

ఈ లేఖ నేను రాసిందేమో కానీ ఏకాత్మగా మారిన  మన రెండు హృదయాల  స్పందనే  కదరా… కాదన గలవా ? 

ప్రేమతో...

నీ  

నేను

1 comments:

Post a Comment