పచ్చిక ఎప్పుడూ పాదాలని
హత్తుకోవాల్సిందేగానీ
ఆహారమై ప్రాణశక్తిగా మారని సత్యమొకటి
నిత్యం అయితేనేం
నేనెప్పుడూ నీకు పచ్చికగానే ఉంటాను
నువ్వెప్పుడూ నా ప్రాణశక్తివై ఉండటానికి
అహరహం మెత్తని నీ పాదస్పర్శ చాలు మరి
నా కలలనీ... నీ నడకలనీ...
దేన్నీ మార్చలేదీ జీవితం
నా స్వప్న మైదానాల వెంట
అప్పటి నుండి ఇప్పటివరకూ
నిన్నే సంప్రదాయంగా కొనసాగిస్తూ
వాటినే ఊపిరిగా సంధిస్తూ
మన ప్రతి చిన్ని క్షణమూ మురిసి పోతుంది
నీ పెదవులు మెత్తగా విచ్చుకుంటున్నప్పుడు
వికసిస్తున్న నవ్వుల కన్నా
వేరే సంజీవని అవసరమే లేదు
నీ వీడ్కోలు నన్ను తాకినా
నాకు నిరంతర ఆయువును అందివ్వటానికి
నీ వీడ్కోలు మొదలైన చోట నేను ఆఖరయ్యాను
నేనాగిన చోట కొత్త నిన్ను కలగంటూ
కళ్ళని తడుముతున్న చెమ్మలని ఊరడిస్తూ
నిన్ను పొడిబారిన పడకుండా కావలి కాస్తుంటాను
ఎప్పటికీ మెరుపుల చందనమై మురిసేలా







0 comments:
Post a Comment