Sunday, 9 August 2015

The Prophet - ఇదొక విస్తృత జీవన వికాస సూత్రం

ఏ బంధమైనా జీవితాన్ని చిగురింప చేసేలా ఉండాలి కానీ బంధనంగా మారి బతుకుల్ని చిధ్రం చేసుకునేలా ఉండకూడదు. ఒకరికొకరు బలహీనంగా మారకుండా బలంగా మారాలంటే స్వంత అస్తిత్వాన్ని కాపాడుకునే  వ్యక్తిత్వం ఉండాలి.   

“వైవాహిక బంధంలో... ఒకరికోసం ఒకరుగా కలసి ఉండాలి  ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు నిలుపుకుంటూ… ఒకరినొకరు ప్రేమించుకోవాలి . కానీ ఆ ప్రేమ అనేది ఏ మాత్రమూ బంధనంగా మార కూడదు.  ఒకరికొకరు హృదయాల్ని ఇచ్చి పుచ్చుకోవాలి  కానీ వాటిని తమ గుప్పెట్లలో  బంధించకూడదు. “

పిల్లలంటే తమ స్వంత ఆస్తి అనుకునే తల్లి దండ్రులు తమ కలల్ని వారి మీద రుద్ది ఆ లేత జీవితాలకి స్వంత వ్యక్తిత్వం లేకుండా చెయ్యటం మన సమాజంలో నిత్య జీవన చిత్రంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు పిల్లలని మనం ఎలా పెంచాలన్నది ఇక్కడ ఎలా చెప్పారో టూకీగా మీరూ చదవండి

“పిల్లలకి పంచాల్సింది మన ప్రేమనే… ఆలోచనల్ని కాదు… వారి ఆలోచనలు వారికి ఉంటాయ్.  పసి దేహాలకి గేహాలు నిర్మించటం మన భాధ్యత కానీ వారి మనసులపై పంజరాలు కప్పకూడదు. మనం విల్లుగా ఉండి పిల్లలని  అస్త్రాలుగా సంధించాలి వారి భవిత వైపు. లక్ష్యాన్ని ఛేదించిన బాణమే  కాదు  విల్లు కూడా గుర్తింపబడుతుంది ”

స్నేహం విలువ తెలిసిన వాడితో జీవితమే స్నేహం చేస్తుంది కదూ.  అలాంటి స్నేహాన్ని ఎలా చూసుకోవాలి ఎంత గౌరవం ఇవ్వాలి. అసలెలా స్నేహం చెయ్యాలి అన్నది ఎలా చెప్పబడిందో చూడండి

“ స్నేహితుడంటే... నీ అవసరాలకి సమాధానమే...  పర్వతాన్ని ఎక్కినప్పుడు కన్నా మైదానం నుండి చూసినప్పుడే దాని గొప్పతనం కనిపించినట్లే, చెలిమి ఎడబాటులోనే తన విలువ తెలుస్తుంది. స్నేహం అనేది ఆత్మీయతా పునాదుల్ని మరింత పటిష్ట పరిచేలా ఉండాలి తప్ప వేరొక దానికై  కాదు. ప్రతి క్షణానికి అమరత్వం  జీవం అద్దటానికేగానీ  కాలాన్ని చంపే కాలక్షేపానికి కాదు స్నేహం… “   

జీవితం ఏ ఒక్క దానికో అనుకూలంగా ఉండదు. దానికి అన్ని అనుభవాలు సమానంగా ఉంటూనే ఉంటాయ్. కాకపోతే తక్కెడ మొగ్గు అటూ ఇటూ మారుతూ ఉంటుంది అంతే.

“ సుఖ దుఃఖాలు రెండూ ఎప్పుడూ కలిసే వస్తాయి. ఒకటి మీ సహపంక్తి భోజనానికి కూర్చుంటే రెండవది మీ శయ్యపై నిద్రిస్తూ ఉంటుంది. “  

ఇలా రాస్తూ పోతే పుస్తకం మొత్తం రాసెయ్యాలి అనిపిస్తుంది.  ఇవన్నీ ఒక వచన కావ్యం లో చెప్పబడిన కొన్ని ప్రవచనాలు మాత్రమే…  

అసలు మనిషి  
ఎలా నడవాలి?
ఎలా మెలగాలి?
ఎలా పెరగాలి ?
ఎలా బతకాలి?

అన్ని ప్రశ్నలకీ ఒక చక్కని సమాధానం Kahlil Gibran విరచితమైన ‘ The Prophet’

అత్యంత క్లిష్టమైన మానవ సంబంధాలని ఎంత సరళంగా మలచుకోవచ్చో తెలిపే అద్భుతమైన పుస్తకం ఇది. మనిషి తన జీవన శిల్పాన్ని సజీవంగా చెక్కుకునే అక్షరాల ఉలి ఈ రచన.

“ ప్రేమ, పెళ్లి, పిల్లలు, దాతృత్వం, తినటం & త్రాగటం, పని, సుఖ దుఃఖాలు, ఇళ్ళు, దుస్తులు, క్రయ విక్రయాలు, నేరమూ శిక్ష, చట్టాలు, స్వాతంత్ర్యం, వివేకం & ఉద్రేకం, పని, ఆత్మ వివేచన, బోధన, స్నేహం, సంభాషణ, కాలం, మంచీ చెడు, ప్రార్ధన, ఆనందం, అందం, మతం & మరణం…”  ఇలా జీవితంలో మనల్ని పలకరించే ప్రతి అంశం గురించి తెలుపుతూ మనిషి తన జీవితాన్ని ఎంత ఆనందకరంగా మార్చుకోవచ్చో క్లుప్తంగా... సూటిగా… మనసుకు నాటుకునేలా సాగిన ఈ రచనని ఒక్క సారి చదివితే  మనకి మనం  కొత్తగా పరిచయం అవుతాం అనుకోవటంలో ఎలాంటి సందేహమూ లేదు.

వివిధ పత్రికల్లో చిన్నప్పటి నుండి మనం చదివిన వ్యాసాలని గుర్తుకు తెచ్చుకుంటే,  పై అంశాల గురించి ఎవరు రాసినా  ఆ రచన  మీద ‘ The Prophet ‘  ప్రభావం  ఎంతో కొంత ఉండే ఉంటుందని మనకి అనిపిస్తుంది.

Kahlil Gibran లెబనాన్ కి చెందిన కవి, తాత్త్వికుడు, చిత్రకారుడు. నలభై ఎనిమిదేళ్ళు జీవించాడు. ఖలీల్ ఈ పుస్తకాన్ని  ముందు అరబిక్ భాషలో రాసి దాన్ని తనే ఆంగ్లంలోకి అనువదించాడు.  ఆయన ప్రతి రచనలోనూ అనేక అంశాల మీద కొంగొత్త తాత్విక సత్యాలు కనిపిస్తూనే ఉంటాయి. తన  రచనలన్నిట్లో తలమానికమైనది ఈ ‘ ది ప్రాఫెట్ ’  అనే పుస్తకం.  40 కి పైగా భాషల్లో కోటి ప్రతులకి పైగా అమ్ముడు పోయిన ఈ రచన కవితాత్వకమైన వచనంలో సాగుతుంది.

అల్ ముస్తఫా  అనే వ్యక్తి  ఆర్పలీజ్ అనే పట్టణాన్ని వదిలే వెళ్ళే సందర్భంగా పుర ప్రజలు అడిగే వివిధ ప్రశ్నలకి సమాధానంగా చెప్పిన ప్రవచనాల సమాహారమే ఈ పుస్తకం.

ఒక్క సారి ఈ పుస్తకాన్ని చదివితే మన ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. జీవితం పట్ల మన దృక్పధం మారుతుంది. జీవితం సరికొత్తగా పరిమళాలు వెదజల్లటం కన్నా మనకు ఇంకేం కావాలి.

నాగరికపు యాంత్రిక జీవనంలో మనిషి తనను తాను బందీ చేసుకున్న సంకెళ్ళు తెంచుకునే ప్రయత్నానికి నాందీ ఈ పుస్తక పఠనం అని నా అభిప్రాయం. వీలైతే మీరూ చదివి మీ అభిప్రాయం చెప్పండి


1 comments:

మీ రివ్యూ చూసాక ఈ బుక్ వెతికి డౌన్లోడ్ చేసి చదివాను. చిన్న పుస్తకమే అయినా మీరు రాసినట్లు మనిషి పుట్టుక నుండీ చావు వరకూ ఎవరితో ఎలా మెలగాలో అసలు మనం ఎలా జీవించాలో మొత్తం నింపుకున్న బరువైన గ్రంధం. చాలా బావుంది. థాంక్స్ ఫర్ ది రివ్యూ.

Post a Comment