ఏయ్ హనీ…
ఎందుకో మనసంతా స్థబ్ధంగా ఉందిరా. ప్రకృతి అంతా ఎప్పుడూ ఆదరంగా నన్ను హత్తుకోవాలి అని నేను అనుకుంటుంటే ఏమైందో ఏమోగానీ పంచభూతావృతమైన ఈ ప్రకృతి ఒక్క సారిగా నాతో మౌనవించేసింది. ఈ మౌనానికి మాటలద్దటం ఎలానో తెలియని నిర్వేదంలో నా ప్రతినిమిషం స్నానించేస్తుంది.
ఏయ్ బంగారూ… నువ్వైనా రాయబారం నడపవూ….
ఆగిన తరువు చిగురుల సడి
కరి మబ్బులు దాచేసిన వెన్నెల ఊట
చిరుగాలుల కవ్వింతల కదలిక
స్వచ్ఛమైన మట్టి తునక పలకరింపు
మళ్ళీ మళ్ళీ నన్ను కదిలించేలా… నిత్యం నాతో ఊసులాడేలా…
ఏయ్… ఆ కళ్ళల్లో నీళ్ళెందుకు…? ప్రకృతి నీకు సవతి అనిపించింది కదూ...! అసలు నా ‘ప్రకృతి’ నువ్వేనన్న నిజం నీకు తెలియదా ఏం? అప్పుడప్పుడూ నాలో కురుస్తున్న నీ మౌనం నన్నెంతగా చలన రహితం చేస్తుందో తెలియచెప్పటానికి కూడా ఆలోచనలు నిర్వీర్యం అయిపోయాయి. అర్థం చేసుకుంటావు కదూ…
నిత్యం నీతో నేనాడే ఊసులతో నా దిగులు జాడల నీడలన్నిటినీ ఊడ్చేస్తున్నా. ఎప్పటెప్పటి బడలికలూ నిన్ను తలవగానే బహు దూరతీరాలకి పారిపోతాయి నా ప్రమేయం లేకుండానే.
ఏయ్ …
ఇప్పుడిక మన అస్తిత్వాల లెక్కలన్నీతీసి చూడు. ఇక ఇక్కడ రెండు మనసులేమీ లేవు. తెలుస్తుంది కదూ ఆ సంగతి. నేనుగా మనలేని నేను ఓ ఆత్మీయ బంధంలో నా అలసటని సేద తీర్చుకోవాలనే గాఢమైన కోరికలోకి జారిపోయాను. ఆ పర్యవసానమే నా చైతన్యం మొత్తం నిరాకారంగా... నీ ఆకారంగా… నీలో ఓ కొత్త ప్రాకారంగా మారిన సవ్వడి నీకే తెలియనంత మౌనంగా నీవుగా కరిగి పోయిన నేను… నాలో నిష్క్రమించిన తరుణం…కురిసిన ఓ ఆనందం…. జన్మాంతరాలుగా పదే పదే తపస్సు చేసిన యోగులకీ అనుభవంలోకి వచ్చి ఉండదేమో…
నన్ను నేను అలౌకికం చేసేసుకున్నాక నీలో నుండి నేను చూసే లోకం మొత్తం నేనుగా కనపడుతుంటే అర్ధమయ్యిందిరా కరిగింది… అలౌకికం అయ్యింది నేను మాత్రమే కాదనీ… నువ్వు కూడా మొత్తంగా మారిపోయిన ఓ సరికొత్త అస్తిత్వానివని…ఏకరూపమై అల్లుకుపోయిన మనం తప్ప ఈ అస్తిత్వంలో ‘నువ్వూ… నేను’ల లెక్కలు లేవని…
ఇట్లు
మనం







0 comments:
Post a Comment