Friday, 8 May 2015

మరి నీ దగ్గర ?

హాయ్ రా…

అప్పుడప్పుడూ మనసెందుకో వెక్కి వెక్కి ఏడుస్తుందేమో అన్న అనుమానం ఉండేదిరా ఒకప్పుడు.  మరి సత్యం, సహజత్వం... స్వచ్ఛంగా  అమరిన మనిషిని మనిషిగా గుర్తించని సహవాసుల మధ్య నివాసం ఎంతటి వినాశనమో కదా మనసుకి.

నిశ్చల తన్మయత్వంలో  శ్వాసలద్దుకుంటూ మోహాన్ని జయించిన ప్రేమని నింపుకున్న మది...  తన సహజ శీల గుణాలు  హేళనకి గురి అవుతుంటే ఎంతటి వేదనకి గురి అయ్యి ఉంటుందో కదా.

తానేమిటో ఎరిగిన ఒక్క తోడు కోసం  ఎంతగా అల్లాడుతూ ఉంటుందో కదూ.  తన ప్రేమని గుర్తెరిగిన మనిషికోసం  తన తపన ఉంది చూశావూ… అంతరాంతరంగాల్లోకి చూసుకున్నప్పుడల్లా నన్ను కలవరపెట్టేసేది.  

అమలినమైన ఆ  ప్రేమని తన హక్కుగా భావించి వలచి వచ్చే  హృదయకోవెల పీఠాధిసతి కోసం తను నిరీక్షణా వ్రతం  చేస్తుంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నేనూ నిరీక్షణలోకి  ఒదిగిపోయా నా మనసు తన శక్తిమేరా నవ్వే సుదినం కోసం.

శిశిర వత్సరాలుగా కదిలిపోయింది గానీ ఒక్క వసంత క్షణాన్నీ తోడ్కొని రాలేదు ఆరారు ఋతువులనీ  శిశిరంగానే  పోతపోసేసిన కాలం.

నాదైన తోడుకోసం తపన…
మధురమైన మాటకోసం ఆశ…
నేనున్నాను కాబట్టి తానుంటుంది అన్న నమ్మకం… తోడుగా
మార్చేసుకున్నా జీవితాన్ని ఒక అవిశ్రాంత శోధనగా…

అనుకోకుండా ఎవరే మీట నొక్కారో గానీ అదాటుగా నువ్వొచ్చేసావ్. ప్రేమ సమీరానివై  నా మనసుకు సరికొత్త ఊపిరిపోసావ్. మనసునే కాదోయ్… నాలోని ఆశావాదినీ సంతృప్తి పరిచావ్.

తపన…ఆశ… నమ్మకం…శోధన… ఎక్కడా నీరసించకూడదు అన్న నిజం నిరూపించావ్ నువ్వూ నన్ను సాధించి.

నిజం కదూ… శోధించినది నేను... సాధించింది నువ్వు… అదే కదా జీవన వైచిత్రి.

వేవేల శిశిరాలు చుట్టుముట్టనీ ఒక్క వసంతంతో  ఊడ్చేయవచ్చు… కావాల్సిందల్లా వసంతం కోసం పంతం పట్టడమే.  

నీ తెల్లని నవ్వులన్నీ నా పెదవుల్ని తడి చేస్తున్న సడిలో  జీవితాన్ని వింటూ ఉన్నా… ఎంత మధురంగా ఉందనీ...

నాకు తెలిసీ నువ్వు నీ మనసూ కూడా ఇవే అక్షరాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటారుకదూ… కాదని అనలేవు. నాకు తెలుసు… నీ గురించిన నా ఊహ ఏదీ నిజం వైపు నడవకుండా ఉండదని.

కలలనిండా నిన్ను చిత్రించుకున్న రోజుల్ని దాటి కనుల నిండా నిన్ను పరచుకున్న కాలసీమరా ప్రతి ఈ నేడూ  కూడా.  

అక్కడెక్కడో నువ్వు
ఇక్కడెక్కడో నేను
రహస్యాల్ని దాటేశాం
మౌనాల్ని చదివేశాం
శబ్దాల్ని చేరవేసుకున్నాం
ఏకాత్మగా మమేకమయ్యాం

ఇక నువ్వెక్కడ?  మరి నేనెక్కడ? 

‘నేను నీకు గుర్తున్నానా?’ అన్న నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర మాత్రమేనా…?

మరి నీ దగ్గర  మాత్రం  లేదూ…!


ఇట్లు,

నీ నేను1 comments:

సమాధానం ఉందని మీకు తెలిస్తే మీరు బాధ పడతారని అలా అడిగుంటారులెండి...

Post a Comment