Sunday, 24 May 2015

యుగాంతంతో యుగళగీతం

ఏయ్ కాలమా…

ఎప్పుడు పుట్టావో తెలియదు. నిరాకారంగా... నిరంతరాయంగా… క్షణం వెనక క్షణాన్ని పరిగిస్తూ నువ్వు సాగించే అనంతపయనంలో ప్రతి లిప్తలో  ఎన్ని వింతలో… 

ఎన్ని రహస్యాలో నీ సౌధపు మంజూషాలలో… 

ఆనంతశూన్యంలోని మహావిస్ఫోటనం... తద్వారా పుట్టిన విశ్వం…వాతావరణం… జీవం… పరిణామ క్రమాలన్నిటికీ సాక్షీభూతం నువ్వు. 

నీ గొప్పతనాన్ని చెప్పేంత పాండిత్యం నాకెలాగూ లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే… నువ్వు  ఏ అంతరాలు చూడని నిజమైన సామ్యవాదివని… ప్రతి జీవికీ సరిసమానంగా నీ సమయాన్ని పంచుతావని.  బుద్ధిజీవులుగా చెప్పుకునేవారు కూడా ఏ నాడూ ఆచరించని  సమన్యాయమిది. సృష్టిలోని ఏ ఇతర ధర్మమూ  ఇంత న్యాయంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు కూడా… 

కోట్ల వత్సరాలని అణువులుగా నింపుకున్ననీ తనువు  ఎప్పుడూ నవ యవ్వనంతో తొణికిసలాడుతూ ఉంటే విశ్వ సృష్టిని కనుసన్నల నుండి భావాతీతంగా చూసిన నీకు అమీబాగా మొదలైన జీవం అనంత విశ్వాన్ని ఆక్రమించేస్తున్నవైనం లిప్తపాటుగా అయినా బాధ కలిగిస్తూ ఉండి ఉంటుంది కదూ… 

ఘడియ ఘడియకూ కోటానుకోట్ల జననమరణాల్ని చూస్తూ మహనీయుల ఆత్మత్యాగంతో పునీతమైన క్షణాలని గుండెల్లో నింపుకుని పరిపూర్ణమైన అలౌకిక ఆనందంలో తేలియాడే నీకు ఆ పాత శూన్యమే సహచరిగా మారితే  గడపబోయే నిస్సారమైన భవిష్యత్తుని  తలచుకోవటానికీ ధైర్యం రావటం లేదు కదూ…

యుగాలుగా సాగిపోతున్న నీ అమరగమనంలో రగిలిన చితుల్నెన్నిటినో చూసి ఉంటావ్ కదూ… ఆ రగులుతున్న చితుల్లో కాలిపోతున్న దేహాలు అంతకుముందు  వెలిగించి వచ్చిన జీవదీప్తులని చూస్తూ నిన్ను నువ్వు సంభాళించుకుని ఉండి ఉంటావ్ ఇన్నాళ్ళ నీ పయనంలో... 

మానవుడు దానవుడై లిఖిస్తున్న రక్త కావ్యాలలో… వాడి నవనాగరికత వీరవిజృంభణలో శకలాలుగా రాలిపడుతున్న శిధిల  చరిత్రలని ఎంతో భద్రంగా  దాచే నీకు, ఆ చరిత్రని అందిపుచ్చుకోవటానికి ఎవరూ మిగలరేమో అన్న ఆందోళన కలచి వేస్తుంది కదూ…

మహాకవులు రాసిన పురాణాలో… 
చరిత్రకందని ఇతిహాసాలో… 
ప్రక్షిప్తాల ప్రహేళికలో… 

శిధిలమైన ప్రతి పుట నువ్వు చదువుతూ వచ్చిందే. అన్నీకథలూ నీకు తెలుసు. 

నీలోకి… లోలోపలికి ప్రవేశించే జ్ఞానమే అందితే మానవ జాతి వికాసమూ… జీవ జాతుల బాంధవ్యాల వైరుధ్యాలు చదివి మనిషి మారుతాడేమో… తను బతుకుతూ అందరినీ బతికించటమే నిజమైన నాగరికత అని ఒక్క క్షణమైనా ఒక  ఆలోచనని తన మదిలోకి ఆహ్వానిస్తాడేమో అని  ఒక చిన్న ఆశ. అలాంటి క్షణం నీలో ఉండి ఉంటే దాన్ని త్వరగా వర్తమానం చెయ్యవూ… 

నువ్వో అనంతం… అవ్యయం… నీలాగే జీవజాతి కూడా అవ్యయమై…. అనంతంగా సాగిపోయే రహస్యాలు నీలో ఉంటే వాటిని త్వరగా బయటకు తియ్యవూ… మనిషి బుద్ధిని సక్రమ మార్గంలో మళ్లే అజమాయిషీ చెయ్యగలిగే అతీత శక్తి నీకు ఎక్కడైనా తారసపడితే దాన్ని ఈ లోకానికి త్వరగా పరిచయం చెయ్యవూ… 

యుగాంతంతో యుగళగీతం పాడే ఆఖరి ప్రాణశక్తిని ఊహించుకోలేని భయంతో...


మనిషి

1 comments:

Post a Comment