Thursday, 30 June 2016

మర్మంబతుకంటే బంగారు నీడలు కప్పుకోవటమనుకుంటూ
వ్యక్తిగతాల్లోనే
జీవన కావ్యాలు మధురాల్ని అద్దుతాయనుకుంటూ
దారంటూ తప్పని వర్తులావృతాల్లో
స్వార్థ కేంద్రాలుగా
మనల్ని మనం
బాటసారులుగా కొనసాగించుకున్నంత కాలం
మనుషులుగా మనం దారి తప్పినట్లేనన్న నిజం
మనల్ని చేరే మార్గం మృగ్యమైన సమయాలివి
మనసు స్పర్శగిట్టని వ్యక్తి వ్యాకరణాలు
వంటబట్టించేసుకుని
మనమిప్పుడు
ఎవరికీ కనపడని రహస్య వధ్యశిలలమై
సంచరిస్తున్న మృత్యు హితైషులం
నిజమే…
మనకెవరూ చెప్పరిక్కడ
మనం... ఒక బలిపీఠం వెంట బెట్టుకుని
తిరుగుతున్న సంచార స్మశానవాటికలమని

తోడంటూ మిగుల్చుకోలేని
బతుకు నడకల్లో అమృత సేవనమంటే
అనంత శూన్యసదనంలో వసించటమేనని
తెలియనంత మూర్ఖత్వం కప్పుకున్న నాగరీకులం

అమృతమూ... మృతమూ…
దిగంతాల మర్మం కావచ్చు కానీ
మనకి మనం మర్మంగా మారటం
విశ్వద్రోహమే...

0 comments:

Post a Comment