ఒక యుద్ధాన్ని గెలిచేసాననుకున్నాక
మనసు గేలిచేసింది తనని గెలిచి చూపమని
అప్పుడే తెలిసింది
గుండెల్ని తడిపిన గెలుపులో
మనకంటూ ఎవరూ మిగలరని
ఇప్పుడిక ఇంకా నాకోసమంటూ
ఎవరు మిగిలున్నారో తెలియదు
అసలెందుకు మిగిలుండాలో తెలియదు
అప్పుడు కాదు ఇప్పుడు గెలవాలని ఉంది
యుద్ధాన్ని కాదు మనసుల్ని గెలవాలని ఉంది
గెలవాలని ఉంది
నిజంగా గెలవాలని ఉంది
నా కోసం నేను
తననీ... నిన్నూ… నన్నూ…
గెలవాలని ఉంది
నా కోసం ఒక స్వచ్ఛ ఉదయం వేచి ఉండటం
అరుణారుణ కిరణ స్పర్శనద్దుకున్న
హేమంత జలాలతో నన్ను శుద్ధి చెయ్యటం
ఒక రాయబడని వాక్యంలో
నువ్వు నన్ను చదువుకుంటూ కనిపించటం
నా విజయాన్ని నువ్వు కన్నుల్లో మెరిపించడం
నీ చెమరించే నవ్వుల్లో నే త్రుళ్ళి పడటం
ఒక కలగా కాదు… నిజంగా
నిజంగా కావాలిప్పుడు
ఒక్క సారి
ఒకే ఒక్క సారి నన్ను నమ్మవూ
నీ నమ్మకంలో నా విజయాలు మొదలవుతాయ్
కాదు కాదు మనిషిగా నేను మొదలవుతాను
మనసులన్నిటిలో చొచ్చుకుపోతాను
మరి ఇప్పుడు నేర్చుకున్నాగా
గెలవటం అంటే పరాజితుడెవరూ లేకపోవటమని






0 comments:
Post a Comment