అందరూ కలలు తినే రాత్రులలో
ఆకలిని తింటూ
నిద్రని ఉరివేసి
శూన్య హాసాన్ని
పెదవికి ముడివేసి
రోడ్డుకు వంటిని ఎరవేసి
కన్నీటి గడ్డవై
దేహాన్ని పరిచేసిన
సుఖ విస్తరి నువ్వు
ఒక నిండు శూన్యమై
లోలోన శబ్దిస్తూ
మనసంతా శీలం నింపుకున్న
మానవత్వపు నిగ్రహానివి
సజీవ చలిత విగ్రహానివి
రేయి చిక్కబడుతున్న కొద్దీ
పలుచబడుతున్న లోకరీతికి
నిలువెత్తు సాక్ష్యానివై
ఇంకా వినిపించని మనిషి అలికిడి కోసం
నిత్య చకోరానివై వేచి చూస్తున్న తేమగుండానివి
అందరికీ కమ్మదనమైన అమ్మదనం
మోయలేని భారమై
నువ్వు రాల్చిన ఏ కన్నీటి చుక్కా
ఇంకా గడ్డ కట్టినట్లు లేదు..
అంతకంతకూ లోకమంతా
మహార్ణవాలు పోటెత్తుతున్నాయ్
లోకపు విలువల ఎత్తిపోతల్లో
ఆనకట్టంటూ లేని పేరులేని చీకటొకటి
యుగాలుగా నిన్ను వీడనంటుంటే
మరి ఇంకెప్పటికీ
కంచికి చేరని కథే నీదెప్పుడూ







0 comments:
Post a Comment