Wednesday, 1 June 2016

దోపిడీ


దేహం మీద మోజు పెరుగుతున్న ప్రతీసారీ

ఒక మాయా అద్దం ఎదురుగా నిలబడటం అలవాటుగా మార్చుకున్నాక
మనసొకటి ఉందన్న విషయాన్ని అలా అలా వెలికి గురిచేసి
నువ్వు జీవించిన జీవితమంతా నీడగా కూడా మిగలదన్న సత్యం
నీకెప్పుడూ ఎదురుపడదు

భూమ్యాకాశాలు ఒకదానికొకటి ఉచ్చులేసుకుంటున్న దృశ్యం కవ్విస్తుంటే
నువ్వు సాగుతున్న బాట నిండా
అడుగడుగునా విశ్రాంతి మందిరమే అక్కరకొస్తుంటే
నీకు నువ్వెప్పుడూ ఒక అస్పష్ట గమ్యానివేనన్న నిజం
నిన్ను చేరే సమయమింకా  రాలేదన్న మాటే

శకలాలుగా దొరుకుతున్న చరిత్రనంతా
కాల్పానిక గాధలతో రక్తి కట్టించటం నేర్చిన నాగరికంలో
జయాపజయాలన్నీ ప్రక్షిప్తాలన్న నిజం ఏ నేలకీ పట్టదు
పురా స్మృతులన్నిటినీ ఖడ్గాల అంచులకి పదునుగా మార్చుకుని
రక్తధారలని తర్పణంగా విడుస్తున్నప్పుడల్లా తన నెత్తుటి దాహం తీర్చుకోవటం తప్ప

వీరత్వానికైనా ఒక ప్రయోజనం ఉండాలన్న సంగతి తెలియక  
నువ్వు చేస్తున్న ఖడ్గచాలనాలన్నీ  
ఒక్కొక్కటిగా నీ వాచాలత్వాలని  పరిచయిస్తుంటే
అల్పత్వాల జడివానలో మురిసిపోతూ
ఇప్పుడు నిజంగానే లోకానికి నువ్వొక విదూషకపు చిహ్నం

నీ భ్రమల కొలువుని వదలకుంటే కలల సాకారం సిద్ధించదు
అవకాశాలని నువ్వు తిరస్కరించిన తరుణాలన్నీ ఏకమయ్యాక
ఎన్ని అనుభవాలని నువ్వు ప్రోదిచేసుకుంటేనేం
వెనక్కి ప్రయాణించి  మళ్ళీ కొత్తగా మొదలవటానికీ లేదు
కాలయంత్రమింకా కనుగొనబడని ఈ తరుణాన

అరె మిత్రమా…
నీ నవ్వులని దొంగిలించడానికి నీ నడకల్ని ఆపెయ్యడానికి ఎవరో విచ్చెయ్యరోయ్
నీకు నువ్వే అడ్డని తెలియకపోవటమే జీవన వైచిత్రం
నిన్ను నువ్వు గెలవగలిగే ఒకే ఒక్క సిధ్ధాంతం

మరి ఇప్పుడిక నిన్ను నువ్వు దోచుకోవటం ఆపెయ్యటమే

0 comments:

Post a Comment