Saturday, 25 June 2016

ప్రణయ గాంధర్వం - 2ప్రేమైషీ,

కోనసీమలో గోదారి గట్టున కొబ్బరి తోటల్లో వెన్నెల రాత్రుల్లో నీవు నేను కలసి ఎన్నో ఎన్నెన్నో ఊసులాడాలని, సంధ్యా సమయాన సాగరతీరంలో సాగరుని ధాటికి అరగిన రాళ్ళమీద మనమిద్దరం కూర్చుని ఉండగా... గాలికి రేగే నీ ముంగురులను సవరిస్తూ సముద్రపు అలల తాకిడికి తడసిన నీ పసిడి పాదాలను నా పెదవులతో స్పృశిస్తూ పచ్చని ప్రకృతిలో నీ వడిలో తల పెట్టుకుని పడుకుని నీ మోమును పలుకరించాలని ఎన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు... అవన్నీ తీరేనా?.

చల్లని సాయంత్రాన తెరలు తెరలుగా సడి చేస్తున్న  పిల్ల గాలుల పరిమళాలతో నీవు నేను చెప్పుకునే ఊసులన్నీ వినే  చిలకా గోరింకలు వాటి సఖులైన మిగిలిన పక్షులకు చెప్పేనా...? చెపితే  బాగుండు. ప్రతి ప్రభాతమూ ఓ సుప్రభాతమై, చిరుగాలుల సవ్వడిలో ప్రేమ పక్షుల కిలకిలరావాలలో మన ప్రేమ రాగాన్ని తన్మయించడం ఎంతటి ఆనందకారకమో కదా!

" ప్రాణమొచ్చిన పసి శిల్పంలా
మనసునొక వెచ్చని వేదిక చేసి
స్వప్నాలన్నిటికీ హద్దులు కట్టేసి
అహరహం వేచి చూస్తున్నా
రా ప్రియా త్వరగా వచ్చేయ్

తూరుపు బాలిక విప్పిన రెప్పల్లో
వెలుగు తిలకం దిద్దుకుంటూ
రాతిరి  పడతి కాటుక చాటుల్లో
విరహపు జోలలని  వల్లెవేస్తూ
ఎన్ని క్షణాలు, ఎన్ని నిమిషాలు,
ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు
వ్యర్ధంగా నిస్సారంగా గడచిపోతున్నాయ్

ఇతిహాసాల మధుపాత్రలన్నీ
పెదవంచుల్లో తమకమద్దుతుంటే
ఎన్ని మల్లెలు, ఎన్ని జాజులు,
ఎన్ని రాత్రులు, ఎన్ని రాగాలు
మధుశాలలై ఊపిరద్దుకున్నాయో
ఇవన్నీ నీ కోసం
నీవొచ్చాక మన కోసం

ఆశతో బేలగా, జాలిగా ఎదురుచూస్తున్నా ప్రియా
నీ లాలింపుకై... నీ పాలింపుకై...
యుగ యుగాల పాలితుడినై !
రా ! ఉన్న పళంగా
గాలి కంటే వేగంగా
మనస్సు కంటే త్వరితంగా

నిన్ను చూడక పోయినా 
నీ సన్నిధి దూరమైనా 
కనీసం నీ స్వరమైనా వినే అదృష్ఠం కోసం
చకోరంలా ఎదురు చూస్తూ చూస్తూ చూస్తూ
నేత్రాంచలాలపై తేమపతాకాన్ని
ఎగురవేసుకున్న  ఆర్ద్ర శ్వాసనయ్యా..."

నిజం... ఒక ఎదురు చూపులో యుగాల చలనాన్నీ గుర్తెరగకపోవటమంటూ ఉంటుందనర్థమయ్యాకే తెలుసుకున్నాను... అనంత కాలమూ పిపీలికంలా కనిపిస్తుందని... క్షణపు కొలత అనంతాన్ని అద్దుకుని భూమండలానికే నిరీక్షణా శ్వాసల వెచ్చదనాన్ని పరిచయిస్తుందని. 

నువ్వు చేసే ప్రతి జాగూ నా ఎదను ఎరగా కొరుక్కుతినే కన్నీటి తడి అవుతుంది. నువ్వు నాదానివన్న స్వాతిశయపు అహమింకా సంశయంలో కొట్టుమిట్టాడటం నీకు మాత్రం ఆనందమా? లేదు కదూ ! 

బుగులుకునే దుఃఖమెంత భారమో కొలత తేల్చగలిగేదెవరైనా ఉంటే పంపి  చూడు. మనఃసాంద్రత నింపుకున్న బిందువుకి సింధువు ఏ సాటి? సింధువు కొలతలే తేలని లోకాన మరి కన్నీటి బిందువుని చూడాల్సింది కొలతలతో కాదోయ్… మమతలతో… మనఃస్పర్శతో...

నా వేచి చూపులకి వీడ్కోలు పలుకుతూ,  గ్రీష్మ ఋతువులో వేడి తాకిడికి మండిపోతున్న అభాగ్యునికి తొలకరి జల్లులు పన్నీటి జల్లుల్లా సేదతీర్చినట్లు నీవు నా దరి చేరి స్వాంతన కలిగిస్తావని నా ఆశ. ఒక్క సారి తొలకరివై తాకాక జాజుల జడివానగా మారకుండా ఉండటం అసాధ్యమేనన్న హామీ  నాది. 

గట్టు తెగటం  అంటూ  ఉండదు  సముద్రానికి, తన పాటికి తాను భూమండలాన్ని ఆక్రమించుకోవడమే తనకి తెలుసు… నా వరకు నువ్వూ  అంతే నీలో నువ్వు కదలకుండా ఉంటూనే నన్ను ఆసాంతంగా ఆక్రమించుకోవటమంటే  మరేమిటనీ?  ఎంత దురాక్రమణదారువో :p. 

నువ్వొచ్చే వరకూ  నా మౌనం మహార్ణవమయితేనేం,  నువ్వొచ్చాక, చూపులే శీతలీకరించేసిన గొంతులో... సగం సగంగానైనా వెల్లడవ్వాలనే మాటల తపనని ఎలా స్వీకరిస్తావోనన్న ఉత్సుకత నా ఊపిరిని భారం చెయ్యటం ఎంతమాత్రమూ వింత కాదు. 

ప్రేమ పొత్తిళ్ళలో పసి పాపాయిలం మనం.  మనలాంటి ఎందరి పాపాయిల స్వచ్ఛ నవ్వులతో తన ఆయువు పెంచుకుందో మరి… తానొక చిరాయువై కోటానుకోట్ల జీవ పరిమళాలని లోకాన కుసుమించటం కాలం పొడుగూతా సజీవ సాక్ష్యమే కదా. 

గాటు పడ్డాకే గంధపు సువాసన లోకానికి వెల్లడవుతుందన్న సత్యం తెలిసిందే కదా. మరి నా ప్రేమా అంతే ! గుండే తడతావో... గాటే పెడతావో… ఏదైనా సరే అక్కడ వెల్లడయ్యే సత్యం మాత్రం… నువ్వే !

నీ

ప్రేమైషి

0 comments:

Post a Comment