గదుల లెక్కకోసం తరువు రెక్కలు తెగిపడుతున్న చోట
కంటికింపుగా ఒక్క పచ్చని గరికకూ మట్టి దొరకని చోట
నాగరికపు ఆడంబరాలు
వల్లెవేయబడుతున్న మనిషి సద్దుల్లో
రేపటి వ్యాపారానికి నేడే పునాదులు తీస్తూ
గాలిని నులిమేస్తున్నారిక్కడ
లెక్కకట్టి అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తూ
నాగరికమేమీ పసిడి గాలులు వీయదన్న సత్యం
ఊపిరి ఖరీదు బంగారమంతటి ప్రియమైన రోజున
బోధపడవచ్చేమో గానీ
మళ్ళీ తరువుని నిలుపుదామన్నా
అభివృద్ధి పొరల కింద సమాధయిన
మట్టి స్పర్శనైతే కొనలేము
మన కాలాన్ని మనమే గడ గడా తాగెయ్యటం
మనల్ని మనం దగా చేసుకోవటమేనన్న నిజం
ఒప్పుకోకున్నా మనల్ని చేరటం తథ్యం
మనిషి మాయమైన రుద్రభూమికి
ఏలికలవ్వటం మనం రాసుకున్న శాపవచనాలే
పచ్చందనాల వాకిట్లో
విశ్వబాహువుల కౌగిట్లో
అతి స్వేచ్ఛగా
సుతి మెత్తగా
మనిషిని శ్వాసించిన క్షణాలని
చీకటింకిన గొట్టపు గదుల్లో
నెమరు వేసుకునే ప్రాణవాయువుకి
ప్రకృతి స్పర్శ మృగ్యమేనన్న సంగతి
ఎవరికీ పట్టకపోవటం
ఒక ప్రళయం నెమ్మదిగా ఆవరించుకోవడమే కదా







0 comments:
Post a Comment