ఎందుకో మరి
తన మనసు వ్యాకరణం అసలర్థం కాదు
బహుశా తాను రాస్తున్న ఎడద లిపికి
ఒక చిత్తుకాగితంగానూ పనికిరాని నిషిద్ధాన్నేమో
తనలో నన్ను సమీక్షించుకున్నప్పుడల్లా
నాలోకి నేను ఒక వర్షపు చినుకునవుతున్నా
గుండెల్లో ఉగ్గబట్టుకున్న
ఒక జ్వలనాన్ని నెమ్మదించటానికి
నీటి వలువలను అల్లుకుంటూ
నాకంటూ ఒక వాక్యం ఉందనుకోవటం
ఎప్పటికప్పుడు నీటి రాతగా మారిపోతుంటే
ముగిసిన పగటిని తెచ్చుకోలేక
కమ్ముకొస్తున్న రాత్రి సవ్వడిని వినలేక
జీవితమిప్పుడు సాంధ్యవర్ణపు కూడలిలో
నిశ్చల విగ్రహమై పోయింది
ఒక్కటైతే నిజం ఎప్పుడైనా సరే
నాదంటూ ఒక వాక్యం ఉందంటే
ముగింపు చుక్క వరకూ తనే







0 comments:
Post a Comment